Rkasha Bandhan | వరంగల్ చౌరస్తా : అన్నాచెల్లెలి అనుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్ వేడుకలను ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారీ అన్నా చెల్లెల్లు. మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే కాని ఆది ఇళ్లయినా, అన్నకు అన్నం పెడుతున్న ఆర్టీసీ బస్సయ్యినా తేడా లేదని చాటిచెబుతూ తమ అనుబంధాన్ని చాటుకున్నారు.
శనివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని తన ముగ్గురు అన్నలకు రాఖీ కట్టడానికి హైదరాబాద్ నుండి వరంగల్‌కు చేరుకున్న చెల్లెలు గట్టు కృష్ణవేణికి ఆర్టీసీ లోకల్ డిపోలో డ్రైవరైన తన అన్న విధుల్లోనే ఉన్నాడన్న విషయం తెలిసి ఇంటికి వెళ్ళకుండా తన అన్న వచ్చే వరంగల్ బస్టాండ్‌కు వచ్చే వరకు అక్కడే వేచివుంది. తాను వచ్చిన వెంటనే బస్సులోకి వెళ్ళి రాఖీ కట్టింది. తన లాంటి ఎంతో మంది అక్కచెల్లెళ్లను వారి గమ్యస్థానాలకు చేర్చడం కోసం విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతూ తానే బస్టాండ్‌లో వేచివున్నట్లు తెలిపింది. అనంతరం తన మిగిలిన ఇద్దరు అన్నలు గడ్డం మహేందర్, గడ్డం యుగేందర్లకు రాఖీ కట్టడానికి ఉర్సు గాంధీనగర్‌కు ప్రయాణమయ్యింది. తమలాంటి వారిని గమ్యస్థానాలకు చేర్చడం కోసం బస్సులోనే రాఖీ కట్టించుకున్న అన్నకు, బస్సులోనే రాఖీ కట్టి ప్రేమను చాటుకున్న చెల్లెలి ఆప్యాయతలకు పలువురు మహిళలు మురిసిపోతూ అభినందించారు.