Nizamabad Encounter | నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ ఒక బూటకమని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడితో పాటు, తమ కుటుంబపై జరిగిన పోలీసుల అమానుష దాడిని సుమోటోగా స్వీకరించాలని జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించిన రియాజ్ తల్లి.. ఇవాళ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు రియాజ్ది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు.
తన కొడుకు రియాజ్ను దారుణంగా చంపేశారని రియాజ్ తల్లి ఆరోపించారు. నా కొడుకు మెడ విరిచేశారు.. పొట్టలో నుంచి పేగులు బయటకొచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసింది రియాజ్ కాదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమోద్ హత్యపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నా కొడుకే నిజంగా హంతకుడు అయితే ఆధారాలు చూపించాలని కోరారు. అప్పుడే తనకు మనశ్శాంతిగా ఉంటుందని తెలిపారు. ఏ తల్లికి అయినా కొడుకు కొడుకేగా అని వ్యాఖ్యానించారు. తన కుమారుడికి జరిగినట్లుగా మరెవరికీ జరగకూడదని కంటతడి పెట్టారు.
నా కొడుకు చనిపోయినప్పుడు, అంతిమ యాత్రలో తీసుకెళ్తుంటే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారని రియాజ్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. నా కొడుకు అంతిమ యాత్రలో పోలీసులు వచ్చి ఎక్కడా ఆగనివ్వకుండా పంపించేశారని తెలిపారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటే, ఇక్కడ చేయకూడదు అని వెళ్లగొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరి కొడుకుకైనా ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ కంటతడి పెట్టుకున్నారు.
రియాజ్ తల్లి భావోద్వేగ మాటలు
నా కొడుకు మెడ విరిచేశారు.. పొట్టలో నుండి పేగులు బయటకు వచ్చాయి. దారుణంగా చంపేశారు
నా కొడుకు నిజంగా హంతకుడు అయితే ఆ ఆధారాలు చూపించండి.. నాకు మనశ్శాంతిగా ఉంటుంది
ఏ తల్లికైన కొడుకు కొడుకేగా.. నా కొడుకుకు జరిగినట్లు ఎవరికి జరగకూడదు
నా కొడుకు… https://t.co/Ksldy7906N pic.twitter.com/naI2e72WAX
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2025
రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై ఓ సోషల్ యాక్టివిస్ట్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రియాజ్ ఒక పోలీస్ అధికారిని నిజంగా చంపితే అతను నిజామాబాద్లో ఉంటాడా.. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పారిపోడా అని ప్రశ్నించారు. పోలీసులు తన కుటుంబాన్ని హింసిస్తున్నారని రియాజ్ తానే స్వయంగా లొంగిపోయాడని తెలిపారు. లొంగిపోయిన తరువాత పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలు పెట్టారు.. అతను కస్టడీలోనే చనిపోయాడని పేర్కొన్నారు. రియాజ్ చనిపోయాక అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, 407 ఖైదీల రూంలో పెట్టారు, 4వ ఫ్లోర్లో ఉన్న రోగులు అందరిని ఖాళీ చేయించారని అన్నారు. చేతులు కట్టేసి ఉంటాయి.. రియాజ్ మెడ విరిగిపోయింది, శరీరం మీద తీవ్ర గాయాలు ఉన్నాయి.. అలాంటి మనిషి పోలీసులను ఎదిరించి గన్ లాక్కుంటాడా? అని ప్రశ్నించారు. అలా చెప్పి, పోలీసుల ఉన్నతాధికారుల సమక్షంలో మృతదేహానికి మూడు బుల్లెట్లను కాల్చారని అన్నారు.
రియాజ్ కస్టడీలో బతికే ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు నడుచుకుంటునో, వీల్ చైర్లోనో తీసుకెళ్తారు కదా.. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. మృతదేహం చూశాక అతని మెడ ఊగిపోతోంది, ముక్కు విరిగిపోయింది, పెదాలు పగిలిపోయాయని అన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వేరీ వేసి నిజానిజాలు బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను నిజంగా హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసి.. ప్రమోద్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. రియాజ్ కుటుంబంపై ఇప్పటికీ వేధింపులు జరుగుతున్నాయని.. ఆ కుటుంబంలోని చిన్న పిల్లలను రోడ్ల మీద వేధిస్తున్నారన్నారు. దీనిపై వాళ్ళకు న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనలో ఆసిఫ్ పాత్ర ఉంది.. అతనిపై లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లో భాగమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు.. ఈ ఎన్కౌంటర్ను కొందరు పోలీసులు కుట్రపూరితంగా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేయలేదు.. అందుకే జాతీయ స్థాయిలో దీనిపై లోతుగా విచారణ జరపాలని అడగడానికి వచ్చామన్నారు.