హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): జూలైలో భారత ఉపఖండంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్‌నినో ఏర్పడేందుకు 50శాతం అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. జూలై, ఆగస్టు , సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో ఏర్పడే అవకాశం 70శాతానికి చేరుకుంటుందని తెలిపింది. కాగా, స్కైమెట్ అంచనాలకు అనుగుణంగానే నైరుతు రుతుపవనాల ప్రవేశం తర్వాత ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. ఇదిలా ఉండగా మరో మూడ్రోజుల్లో శీతాకాలం ముగుస్తుందని అంచనా వేసినట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత తగ్గి.. ఎండ తీవ్రత పెరుగుతున్నదని పేర్కొన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34.9 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలుగా నమోదైందని పేర్కొన్నది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు తెలిపింది. మహబూబ్‌నగర్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు పేర్కొన్నది. హైదరాబాద్‌లోనూ రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వెల్లడించింది.