హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఈశాన్య, వాయవ్య గాలులతో నాలుగు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది. పలు జిల్లాల్లో సాధారణం, మరికొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయని వెల్లడించింది. గాలుల దిశలో మార్పుల కారణంగా ఫిబ్రవరిలో ఒక వారం చల్లగా, మరో వారం వేడిగా ఉండే అవకాశమున్నట్టు తెలిపింది. మార్చి నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టంచేసింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తుండడంతో వారంపాటు చలి ఉంటుందని, ఫిబ్రవరి రెండోవారం వరకు కొన్నిసార్లు వేడి, కొన్నిసార్లు చల్లగాలులు వీస్తాయని, మూడో వారం నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా కనిపించనున్నట్టు వివరించింది.