e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides నెట్‌ఇంట్లో కాలక్షేపం!

నెట్‌ఇంట్లో కాలక్షేపం!

  • లాక్‌డౌన్‌తో మళ్లీ పెరుగుతున్న ఇంటర్నెట్‌ వినియోగం
  • ప్యాకేజీలను పెంచుకుంటున్న బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు
  • వినియోగం పెరుగుదల వెనుక 5 ప్రధాన కారణాలు
  • నెలకు సగటు ఇంటర్నెట్‌ డాటా వినియోగం
  • 2015: 563 మెగాబైట్లు (0.5 జీబీ)
  • 2021: 15-16 జీబీ
  • లాక్‌డౌన్‌లో పఠిస్తున్న పంచసూత్రం
  • స్ట్రీమింగ్‌, సర్ఫింగ్‌, గేమింగ్‌, రీడింగ్‌, వర్కింగ్‌
నెట్‌ఇంట్లో కాలక్షేపం!

హైదరాబాద్‌, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్‌వేవ్‌తో దాదాపు దేశమంతా మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఇంటర్నెట్‌ వినియోగం మళ్లీ వేగం పుంజుకున్నది. గతేడాది మూడునెలలపాటు విధించిన లాక్‌డౌన్‌తో దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. బయటకు వెళ్లే వీలులేకపోవడంతో అధికశాతం మంది నెట్టింట్లోనే గడిపారు. ఆన్‌లైన్‌ క్లాసులు, వీడియోకాల్స్‌, ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. 2019తో పోల్చితే ఏకంగా 30 శాతం డాటాను అదనంగా వినియోగించారు. జూలై నుంచి సడలింపులు ప్రారంభం కావడం.. సెప్టెంబర్‌ నాటికి దాదాపు అన్నిరకాల కార్యకలాపాలు గాడిన పడటంతో డాటా వినియోగం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. వర్క్‌ఫ్రమ్‌హోం తగ్గడం, ఆఫీస్‌లు, దుకాణాలు, మాల్స్‌ అన్నీ తెరుచుకోవడంతో నెట్‌ వినియోగించేవారి సంఖ్య కాస్త తగ్గింది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఒక్కో ఇంటర్నెట్‌ యూజర్‌ సగటున నెలకు 15.7 జీబీ డాటా వినియోగించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. సెప్టెంబర్‌ నాటికి ఇది 12-13 జీబీకి తగ్గినట్టు తేలింది. దేశంలో సెకండ్‌వేవ్‌ విజృంభణ మొదలైన నాటినుంచి డాటా వినియోగం మళ్లీ పెరిగిందని టెలికం రంగ నిపుణులు చెప్తున్నారు.

ఇందుకు పలు కారణాలను సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు, చికిత్స, మెడికల్‌ ఆక్సిజన్‌ గురించి యూట్యూబ్‌, ఇంటర్నెట్‌లో వెదకడం, కరోనాకు సంబంధించిన విషయాలను ఎక్కువగా చూడటం, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌చేసి చర్చిస్తుండటం, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్ల గురించిన సమాచారం కోసం వెదకడం తదితర కారణాల వల్ల డాటా వినియోగం క్రమంగా పెరిగినట్టు పేర్కొంటున్నారు. తర్వాత ఒక్కోరాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో తిరిగి గతేడాది లాక్‌డౌన్‌ స్థాయికి డాటా వినియోగం పెరిగిందని చెప్తన్నారు. మళ్లీ వర్క్‌ఫ్రమ్‌హోం చేస్తుండటం, ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుండటం వంటివి ఇందుకు బూస్టింగ్‌ ఇచ్చాయని వివరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 74 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు.

బ్రాడ్‌బ్యాండ్‌.. అప్‌గ్రేడ్‌
లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు సైతం పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశంలో సుమారు 2.3 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు. రెండు నెలలుగా వీరి డాటా వినియోగం 50-60% పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. సుమారు 40% మంది గతంతో పోల్చితే 50-100% అధిక డాటా ఇచ్చే ప్యాకేజీలకు మారుతున్నారు. ‘ఒకప్పుడు 30 ఎంబీపీఎస్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉండేది. ఆ తర్వాత 100 ఎంబీపీఎస్‌కు మారారు. గతేడాది లాక్‌డౌన్‌తో 150 ఎంబీపీఎస్‌, 300 ఎంబీపీఎస్‌, 500 ఎంబీపీఎస్‌ వరకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు చాలామంది 1 జీబీపీఎస్‌ ప్యాకేజీలు అడుగుతున్నారు. కొందరు అన్‌లిమిటెడ్‌ ప్యాకేజీలు ఉన్నాయా? అని తెలుసుకుంటున్నారు’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ ప్రతినిధి చెప్పారు.

ఆన్‌లైన్‌ పంచతంత్రం
డాటా వినియోగం పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
1) వర్కింగ్‌: కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతేడాది వర్క్‌ఫ్రమ్‌హోం ప్రారంభించారు. దీనితో సంస్థలకు సైతం నిర్వహణ భారం తగ్గుతుండటంతో అనేక కంపెనీలు ఇంటినుంచి పనిని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు పెరుగుతుండటంతోపాటు అధికవేగం ప్యాకేజీలకు మారుతున్నారు.
2) సర్ఫింగ్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూజర్లు ఆన్‌లైన్‌లో ఉండే సమయం బాగా పెరిగింది. వీడియోకాల్స్‌, కరోనా, సంబంధిత అంశాల వెబ్‌సర్ఫింగ్‌, సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అలవాటుగా మారిందని నిపుణులు అంటున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గత రెండునెలల్లోనే సుమారు 27% పెరిగినట్టు అంచనా. ప్రస్తుతం ఒక్కొక్కరు సగటున రోజులో 4.3 గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌లో మునిగి తేలుతున్నారట.
3) స్ట్రీమింగ్‌: లాక్‌డౌన్‌లో అనూహ్యంగా పుంజుకున్న రంగం ఓటీటీ. సినిమాహాళ్లు మూసేయడంతో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, ఆహా వంటి ఓటీటీలకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. కొత్త సినిమాలు, సీరియళ్లు వస్తుండటంతో ఓటీటీలవైపు మొగ్గుచూపేవారు క్రమంగా పెరుగుతున్నారు. ఒక సర్వేలో పాల్గొన్నవారిలో 60 శాతం మంది ఓటీటీలే చూస్తామని చెప్పగా, టీవీ చూస్తామని చెప్పినవాళ్లు 20 శాతం మంది మాత్రమే.
4) గేమింగ్‌: లాక్‌డౌన్‌లో యువత ఆన్‌లైన్‌ గేమ్స్‌కు విపరీతంగా అలవాటుపడ్డారు. దీంతో గంటలపాటు ఆటల్లోనే మునిగితేలుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసమే ప్రత్యేకంగా డాటా ప్యాకేజీలు రీచార్జి చేసుకుంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
5) రీడింగ్‌: విద్యాసంస్థలు తెరుచుకోక ఏడాదిన్నర గడిచింది. చదువులన్నీ ఆన్‌లైన్‌లోనే. దీంతో ఎడ్యుకేషన్‌ యాప్స్‌కు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌ కోర్సులు, స్టడీమెటీరియల్స్‌ కోసం ఎగబడుతున్నారు. 2019తో పోల్చితే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ ఒక్క ఏడాదిలోనే 52 శాతం పెరిగిందని మార్కెట్‌వర్గాలు చెప్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నెట్‌ఇంట్లో కాలక్షేపం!

ట్రెండింగ్‌

Advertisement