శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 1,69,044 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,47,195 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.50 అడుగులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.0439 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna Sagar) నిండుకుండాలా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 583.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 293.97 టీఎంసీల నీరు ఉన్నది. మరో 18 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది.