హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, మిగిలిన జిల్లాల్లోనూ 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ మేరకు శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) లో అత్యల్పంగా 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రహదారులపై సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం పూట ఇండ్ల నుంచి బయటకిరావొద్దని సూచించింది.
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నదని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నదని పేర్కొన్నది. ఈనెల 21నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం.. ఈనెల 24నుంచి 27వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.
