హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న నేరాలను గమనిస్తుంటే పోలీస్‌శాఖ వైఫల్యం సుస్పష్టంగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్‌శాఖపై కొరవడిన పర్యవేక్షణే నేరగాళ్లు రెచ్చిపోవడానికి కారణమవుతున్నదని పలు సంఘాలు మండిపడుతున్నాయి. ఎంత పెద్ద నేరం చేసినా బెయిల్ తెచ్చుకొని తప్పించుకోవచ్చుననే ధీమాతోనే ఈ ఘాతుకాలు పెరుగడానికి కారణమవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పోక్సో కేసు నమోదైనా బండి భగీరథ్, రాజ్‌కుమార్ లాంటి వారికి బెయిల్ వచ్చిందంటే ఇందులో పోలీస్ శాఖ వైఫల్యం లేదా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హోంశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి ధోరణి..ఆయన వ్యవహారశైలే ఈ నేరాల పెరుగుదలకు, పోలీస్ శాఖ కట్టు తప్పడానికి కారణమనే వాదనలూ ఉన్నాయి.
రెండున్నరేండ్లుగా మారిన పరిస్థితులు
రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా నేరాల రేటు పెరిగిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 1,38,312 నేరాలు నమోదైతే.. 2024 నవంబర్ 30 నాటికి 2,34,158 నేరాలు నమోదయ్యాయి. మళ్లీ 2025 నవంబర్ నాటికి కూడా ఆ సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా 2,28,695 నేరాలు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థపై పూర్తిస్థాయి నజర్ ఉండేది. ఎప్పటికప్పుడూ స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ రివ్యూలు నిర్వహిస్తుండేవారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసేవారు. ఇక ప్రస్తుతం హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కానీ, పోలీసుశాఖపై దృష్టిసారించలేదు కదా.. కనీసం మంత్లీ క్రైమ్ రివ్యూలు సైతం నిర్వహించడం లేదు. కనీసం 3, 6, 9 నెలలకోసారైనా క్రైమ్ రివ్యూ చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో పోలీస్‌శాఖపై పర్యవేక్షణ కొరవడింది. ఇదే నేరస్తులకు వరమైంది.
నడిరోడ్లపై హత్యలు, మహిళలపై వేధింపులు
కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లకు స్వేచ్ఛ లభించిందనడానికి పోలీసుశాఖ విడుదల చేస్తున్న వార్షిక క్రైమ్ నివేదికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 2023తో పోల్చితే.. 2024లో నేరాలు ఏకంగా 22% పెరిగాయి. ఇందులో అత్యంత దారుణమైన హత్యలు 856 ఉన్నాయి. ఇక తెలంగాణలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేదని చెప్పడానికి నమోదైన 2,945 రేప్ కేసులే ఉదాహరణ. ఇక కిడ్నాప్‌లు, దొంగతనాలకు కొదువేలేదు. మహిళలపై వేధింపులకు అడ్డూఅదుపే లేదు. నేరం చేసినా తప్పించుకోవచ్చనే ధోరణితోనే ఈ నేరాల రేటు పెరుగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో పోలీస్ శాఖను ఆధునీకరించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నేరస్తుల్లో భయం కలిగించేలా పలు కీలక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో లక్షలాది సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిఘా కెమెరాలు, ట్రాఫిక్ వ్యవస్థను ఒకే చోటు నుంచి పర్యవేక్షించేలా ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ప్రవేశపెట్టారు. బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలను పట్టుకోవడంలో ఈ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చింది. నేరస్తుల సంచారం ఎకువగా ఉండే ప్రాంతాలు, అనుమానాస్పద కాలనీల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, పాత నేరస్తులను, అసాంఘిక శక్తులను నియంత్రించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు క్రైమ్ రివ్యూలు నిర్వహించేవారు.
గంటల తరబడి సాగే ఆ రివ్యూల్లో అన్ని నివేదికలను సమగ్రంగా సమీక్షించి.. నేరాల నివారణకు కఠినమైన సూచనలు చేసేవారు. ఆ క్రమంలో సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, డ్రగ్స్‌ను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో (ఇప్పుడు ఈగల్)ను ప్రవేశపెట్టారు. కొత్త కమిషనరేట్లు, వేలాదిగా పోలీసు కొలువులు చేపట్టారు. మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక దాడుల వం టి సున్నితమైన కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్ష లు పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏ ర్పాటు చేసేందుకు న్యాయశాఖతో సమన్వ యం చేసుకున్నారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ సామర్థ్యాన్ని పెంచారు. డిజిటల్ ఆధారాలు, బయోమెట్రిక్ డాటా ఆధారంగా కోర్టు ల్లో పకా సాక్ష్యాలను ప్రవేశపెట్టడం ద్వారా కేసుల నేర నిరూపణ శాతం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. అత్యాధునిక వాహనాలతో విజిబుల్ పోలీసింగ్ నిమిషాల్లోనే ఘటనా స్థలం లో ఉండేవారు. ఇలా నేరాల కట్టడిని అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించేవారు.
ఏటేటా తగ్గిపోతున్న శిక్షల రేటు..
గత ప్రభుత్వ హయాంలో నేరం జరిగితే వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేవారు. సరైన సైంటిఫిక్, సాంకేతిక ఆధారాలు సేకరించి, కోర్టుకు చార్జిషీటుతో సమర్పించేవారు. నేరాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి.. నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకునేవారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్థను మొత్తం సిద్ధంగా ఉంచేవారు. ఇక పోక్సో కేసుల్లో అయితే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ల ద్వారా బాధితులకు న్యాయ, వైద్య, ఆర్థిక సహాయాలతో పాటు..కౌన్సెలింగ్ కూడా ఇప్పించి.. భరోసా ఇచ్చేవారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో దోషులకు సకాలంలో శిక్షలుపడేలా చర్యలు తీసుకునేవారు. దీంతో నాడు ఏటేటా శిక్షల రేటు పెరిగేది. అన్ని నేరాల్లోనూ కన్విక్షన్ రేటు పోలీసులకూ తృప్తినిచ్చేది. 2023లో కన్విక్షన్ రేటు 39శాతం ఉంటే.. 2024లో 35శాతమే నమోదైంది. ఇక 2024లో 28,447 శిక్షలు పడితే.. 2025లో కేవలం 3,885 మాత్రమే నమోదైనట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.