తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టుకు కూడా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ చెప్పింది వందశాతం అబద్ధమని ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘సంబంధిత మంత్రి లేని పక్షంలో ఎవరైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడగవచ్చు. 152 సెక్షన్ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నట్టు దూబే చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఇది తప్పు అని మేము ఆయన వద్దకు వెళ్లి చెప్పాం. నిశికాంత్ దూబేకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తప్ప మరో విషయం తెలియదు. ఆయనకు కనీస అవగాహన లేదు. తెలంగాణ గురించి తెలుసుకోకుండా నోటికి వచ్చింది చెప్పారు. ఆయన తీరుపై బీఆర్ఎస్ పార్టీ గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తుంది’ అని వెల్లడించారు.