జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు సమన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు పెద్దన్నగా ఆదుకుంటున్నారని అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్, క్రిస్మస్ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో నాలుగు వేల కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 21న హైదరాబాద్ ఎల్.బీ స్టేడియంలో ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ విందుకు హాజరు కావాలని కోరారు . ఈ సందర్భంగా క్రైస్తవులకు మంత్రిక్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత , డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , జడ్పీటీసీలు సుధారాణి , బాదినేని రాజేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.