కామారెడ్డి, నవంబర్ 19: ‘తప్పుడు మాటలొద్దు.. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు బాగానే కొనుగోలు చేస్తున్నది. మాకెవలకూ సమస్యనే లేదు. నిన్న మొన్న ధాన్యం తెచ్చినవాళ్లను పట్టుకుని కొంటలేరని వాళ్లతో అనిపిస్తే ఎట్ల..?’
ఇది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిద్దిరాములు అనే రైతు సూటిగా సంధించిన ప్రశ్న. ఈ సన్నివేశం శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఎదురైంది. ‘కల్లాలకు కాంగ్రెస్’ పేరిట రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తదితరులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఒకరిద్దరు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ వడ్లు కొనడం లేదని ఒక రైతు చెప్పడమే ఆలస్యం.. రేవంత్‌రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ, ప్రసంగం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న మరో రైతు సిద్దిరాములు రేవంత్ ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మేం 20 రోజుల నుంచీ లైన్ల ఉన్నం. అన్నీ సక్రమంగనే ఉన్నయ్. మాకెవలకూ సమస్యనే లేదు. నిన్నగాక మొన్న వడ్లు తీసుకొచ్చిన ఈయన కొంటలేరని చెప్తే.. మీరు మైక్ అందుకుని మాట్లాడుడేంది? కేంద్రాల్లో సీరియల్ నంబర్ల ప్రకారం వడ్లు మంచిగనే కొంటున్నరు. మనం ఆగపడి.. వడ్లు కొంటనే లేరని నిందలేసుడు తప్పు..’ అని సిద్దిరాములు అన్నారు. దీంతో రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. కాంగ్రెస్ నాయకులు సిద్దిరాములును వారింపజేసే ప్రయత్నంచేశారు. మరికొందరు రైతులు సైతం సిద్దిరాములు వెంట నిలిచారు. కల్లాల దగ్గరకు వచ్చి రాజకీయాలు చేయడం కాదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకునేలా ఉండటంతో పోలీసులు రైతులను, కాంగ్రెస్ నేతలను వారించారు. అనంతరం రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.