పెన్‌పహాడ్, ఫిబ్రవరి 14 : వండే ముందు అన్నం మనదే అనుకుంటాం. కానీ తినే ముందు గిన్నె లాక్కుంటే మన పరిస్థితి ఏమిటీ?. అచ్చంగా ఇలాగే ఉంది పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని రైతుల దుస్థితి. వ్యవసాయానికి పెట్టుబడి సాయం మొదలు పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల వరకు కేసీఆర్ ప్రభుత్వం సాగును సంబురంగా మారిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా దొరికితే చాలు అదే పెద్ద సంబురంగా భావిద్దామనుకున్నా అదీ లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
పెన్‌పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం సింగిల్ విండో కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం 444 బస్తాలు యూరియా రాగా దిగుమతి చేసుకుని గోదాంలో ఉంచారు. శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు యూరియా వచ్చినా కుడా కంప్యూటర్లో ఎలాంటి స్టాక్ అప్లోడ్ చేయలేదు. కానీ శనివారం ఉదయం 7.25 నిమిషాల సమయంలో పీఏసీఎస్ పరిధిలో ఉన్న సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసి 444 బస్తాల యూరియాను యాప్‌లో అప్లోడ్ చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ విషయంపై రైతులు పెద్ద సంఖ్యలో సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు తెల్వకుండా పాస్వర్డ్ ఇతరులకు ఎలా తెలుస్తదని ఏఓ అనిల్ నాయక్‌ను నిలదీశారు. దీనిపై వ్యవసాయ అధికారి మాట్లాడుతూ యూరియా బస్తాలను షాప్ వద్దకు చేర్చడమే తమ బాధ్యత అని కంప్యూటర్లో లాగిన్ చేయడం తమ పని కాదని చెప్పారు. ఈ సంఘటనపై నారాయణగూడెం సింగిల్ విండో సహకార సంఘం వారు వెబ్ సైట్ హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే సమయంలో యూరియా బుక్ చేసుకున్న రైతులు వచ్చి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోయిన వానాకాలం పడ్డ బాధలకన్నా ఈ యాసంగిలో రెట్టింపు అనుభవించాల్సి వస్తుందన్నారు.
ఎరువుల దుకాణాల వద్ద రైతులు లైన్లో ఉండవద్దని, ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు తెలిసేలా ముందే బుక్ చేసుకుని షాపులకు వెళ్తే ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఇటీవల ‘ఫర్టిలైజర్ మొబైల్ యాప్’ను తీసుకువచ్చినా అందులో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ యాప్ రైతుల పాలిట నరకయాతనగా మారిందని, యాప్‌లో నో స్టాక్ కనిపించడం, ఒకవేళ బుక్ చేసుకున్నా దుకాణాలకు వెళ్తే సర్వర్ సమస్యతో అక్కడే గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ఎవుసం పనులు పక్కన పెట్టి పొద్దంతా రైతులు ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చున్నా ఫలితం లేకుండా పోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.