వరంగల్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవలి చర్యలు, మాటలతో వివాదాస్పద మంత్రిగా మారిన కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య పంచాయితీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరింది. సినీ హీరో నాగార్జున కుటుంబంపై అవాకులు, చెవాకులు మాట్లాడటం, దసరా ఫ్లెక్సీల్లో ఫొటోలపై పంచాయితీకి దిగడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు వంటి అంశాలపై మాట్లాడేందుకు రావాలని మంత్రి కొండా సురేఖకు, అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం ఆఫీసు నుంచి పిలుపువచ్చింది. దీంతో వారిద్దరు సోమవారం హైదరాబాద్ వెళ్లారు. బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి వీరిద్దరిని కలువలేదు.
ఒకటిరెండు రోజుల్లో వారిద్దరితో రేవంత్‌రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మంత్రి సురేఖ తీరుతో రాష్ట్రంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రభుత్వానికి, అధికార పార్టీకి తలెత్తిన ఇబ్బందులపై సీఎం ప్రత్యేకంగా సమాచారం తెప్పిస్తున్నారని, అందుకే కొన్ని రోజులు సమయం తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గా లు చెబుతున్నాయి. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య పంచాయితీ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వీరిద్దరితో ఫోన్లో మాట్లాడారు.
ఒకే పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఇలాంటివి జరగడం సరికాదని, వీటితో క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొన్నట్టు తెలిసింది. త్వరలోనే ఇద్దరితో కలిసి మాట్లాడతామని, అప్పటివరకు గొడవలు లేకుండా రెండు వర్గాల వారు సంయమనంతో ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. పరకాల నియోజక వర్గంలోని గీసుగొండ మండలం ధర్మారంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్ల్సీల్లో ఫొటోల విషయమై మంత్రి సురేఖ అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలకు దారితీసింది.
కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయాలని, ఘర్షణకు దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవద్దని మంత్రి సురేఖ గీసుగొండ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చొని ఆదేశాలు ఇవ్వడంపై ప్రభుత్వంలో, అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ వారిపై కేసులు పెట్టాలని, తాను చెప్పినట్టు వినని పోలీసులను ట్రాన్స్ఫర్ చేయాలని మంత్రి సురేఖ బహిరంగంగా పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దసరా సందర్భంగా ఒకచోట జరిగిన చిన్న గొడవలో మంత్రి నేరుగా జోక్యం చేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్వతంత్ర సంస్థతో హైకమాండ్ విచారణ
ఇటీవల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సినీనటుడు నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళా మంత్రిగా ఉండి, మరో మహిళపై సురేఖ చేసిన ఆరోపణలను అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ మీడియా తీవ్రంగా తప్పుబట్టింది.
సురేఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంపై అనేక వర్గాలు, ముఖ్యంగా మహిళా సంఘాలు ఒత్తిడి పెంచాయి. దీంతో తెలంగాణ పీసీసీతో సంబంధం లేకుండానే మంత్రి సురేఖ వ్యవహారంపై ఓ స్వతంత్ర సంస్థతో క్షేత్ర స్థాయిలో ఉమ్మడి వరంగల్, హైదరాబాద్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నది. ఈ నివేదిక ఆధారంగా జాతీయ నాయకత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యేలతో పడదు..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకుగాను 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సురేఖకు ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న సీతక్క, సురేఖ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెత్తనం నడిపిస్తున్నారు.