ఇబ్రహీంపట్నం, జనవరి 28 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏ వార్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలియని వ్యక్తి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నందికంటి శ్రీధర్‌తో కలిసి హాజరైన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత పదిహేనేండ్లలో వందల ట్రాన్స్ఫార్మర్లు వేయించామని, ఏ రోజూ ఏ ఒక్క ఫొటో కాని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శిలాఫలకాలు కూడా వేసుకోలేదు. కాని, ప్రస్తుత ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే కూడా శిలాఫలకాలు వేసుకునే దిక్కుమాలిన పరిస్థితి చూడలేకపోతున్నామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయం, నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం, నూతన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం, కూరగాయల మార్కెట్, చేపలు, పూల మార్కెట్లతో పాటు ప్రజలకు కావల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించిన ఘనత కేసీఆర్‌దని గుర్తుచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన కోట్లాది రూపాయల నిధులనే తిప్పుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల్లో పెద్దఎత్తున శంకుస్థాపన బోర్డులు వేసి షో చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రారంభించిన భవనాలు పనులు కొంతమేరకు పూర్తయినప్పటికీ వాటిని కూడా పూర్తిచేయలేని దౌర్భాగ్యం కాంగ్రెస్ సర్కారు హయాంలో నెలకొందని విమర్శించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పదిహేనళ్ల క్రితం నీటి బిందెలు, కుండలతో తాగునీటి కోసం ధర్నాలకు దిగేవారని, రూ.38 కోట్లతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజల తాగునీటి దాహార్తి తీర్చడం కోసం పైపు లైన్లు వేయించి నిరంతరం నల్లా నీటిని అందించినట్లు గుర్తుచేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ప్రధాన రహదారులతో పాటు ఇతర పనులను వివరిస్తూ కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాదగిరి, సుదర్శన్‌రెడ్డి, కృపేశ్, బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, ఇందిర, రాజు, వేణుగోపాల్‌రావు, రాజ్‌కుమార్, శివసాయి, సాయి, ప్రవీణ్, రాజేశ్, రవీందర్, సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏ వార్డు ఎక్కడుందో తెలియని మనిషి ఇబ్రహీంపట్నం నియోజవర్గానికి ఎమ్మెల్యే కావడం దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీకి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులు దొరకడంలేదు. ఎవరిని పెట్టాలో.. ఎవరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తే గెలుస్తారో కూడా ఆయనకు తెలియదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరూ నిరుత్సాహపడొద్దు. ప్రతి కౌన్సిలర్‌ను గెలిపించడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
– ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత కాంగ్రెస్ పాలకుల హయాంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇంటింటికి తాగునీరుతో పాటు ప్రజలకు కావల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతోనే జరిగాయి. ప్రజలకు ఈ విషయాలను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ల విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి.
– సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలి. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే రెండేళ్ల పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొన్నది. ఎక్కడకు పోయినా ప్రజలు బీఆర్ఎస్ పాలననే గుర్తుచేస్తున్నారు. రెండేళ్లకే వందేళ్లు నిండిపోయాయని అంటున్నారు.
– నందికంటి శ్రీధర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి