సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత పొందే ఆర్థిక ప్రయోజనాలతో పిల్లల పెండ్లిళ్లు, గృహ నిర్మాణం లాంటివి పూర్తి చేస్తామని అనుకుంటారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా తీరిక లేని ఉద్యోగం వల్ల, తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలతో విరామ జీవితంలో ఈ పనులు చేయొచ్చని యోచిస్తారు. రాష్ట్రంలో మార్చి 2024 తర్వాత రిటైరైన ఉద్యోగుల పరిస్థితి దుర్భరమే కాదు.. దు:ఖపూరితంగా ఉన్నది.
గడిచిన 21 నెలలుగా 14 వేల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందినా వాళ్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్క్యాష్మెంట్, అన్నీ కలిసి ఒక్కొక్కరికి సరాసరి రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం వీరందరికీ నెలవా రీ పెన్షన్ మాత్రమే వస్తున్నది. ప్రభుత్వ విధానాలతో రిటైర్డ్ ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పింఛను పొందడం ఉద్యోగి ప్రాథమిక హక్కు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఉద్యోగి జీవన పదఘట్టంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తనకు లభించే పింఛన్, ఇతర బెనిఫిట్స్ నియమ నిబంధనల మేరకు ఉద్యోగి పొందుతారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే చెల్లిస్తూ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రయోజనాలను అందించకుండా వేధిస్తున్నది.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల పట్ల పేర్కొన్నట్టు రిటైరైన ఉద్యోగులకు అందించాల్సిన బకాయిలను ప్రభుత్వం అందజేయకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొందరి ఆరోగ్యం క్షీణించి వివిధ రోగాల బారిన పడుతూ చికిత్స పొందుతూ లక్షల్లో బిల్లులు చెల్లించుకోలేని స్థితిలో రాష్ట్రవ్యాప్తంగా 42 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయారు.
చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు వైద్యానికి డబ్బులు అందక ఆవేదన చెందుతూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నా పాలక పెద్దల్లో చలనం లేకపోవడం తీవ్ర విషాదం. పెన్షనరీ బకాయిలు అందక చనిపోతుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎన్నాళ్లు ఈ ఎదురుచూపులు అనే ఆవేదనలో రిటైరైన ఉద్యోగులు వేచిచూస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోవడం శోచనీయం.
ఒకప్పుడు ‘పత్తి రైతుల ఆత్మహత్యలు’ ఎలా అయ్యాయో.. రాను రాను ‘రిటైరైన ఉద్యోగుల ఆత్మహత్యలు’ అనే పరిస్థితికి ప్రభుత్వమే తీసుకొస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించి, రిటైరై బకాయిలు పొందలేకపోయిన వారి డబ్బును ఒకేసారి చెల్లించి, వారు నిరాశ, నిస్పృహలకు, మనోవేదనకు, ఆత్మహత్యలకు గురికాకుండా చూడవలసిన అవసరం ఎంతో ఉన్నది.
-కోహెడ చంద్రమౌళి, 9441254983 .రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ