హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : వైద్యరంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త ఒరవడివని సృష్టిస్తున్నది. ఏఐ సాయంతో హైదరాబాద్ కిమ్స్ వైద్యులు విప్లవాత్మక పరిశోధనలనకు నాంది పలికారు. ఏఐతో చెస్ట్ ఎక్స్‌రేలను ఉపయోగించి క్షయ వ్యాధిని గుర్తించారు. క్యూఎక్స్ఆర్ అనే ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది రోగుల చెస్ట్ ఎక్స్-రేలు విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించారు. ఆ తర్వాత రేడియాలజిస్టుల పద్ధతిలో నిర్ధారించారు. మొత్తం గుర్తించిన కేసులలో 88.7శాతం కచ్చితమైనవిగా తేలింది. టీబీ లేదని నిర్ధారించడంలో 97శాతం కచ్చితత్వాన్ని ఏఐ సాధించింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1శాతంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ రేడియాలజిస్టులు నిర్ధారించారు. క్లినికల్ డయాగ్నోసిస్‌లో ఏఐ సామర్థ్యం, కచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యంలో, సంప్రదాయ రేడియోగ్రఫీతో వ్యాధిని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఇలా ఏఐ సాయంతో వ్యాధి నిర్ధారణ సులభతరం కానున్నదని కిమ్స్ వైద్యులు వివరించారు.
వైద్య పరీక్షలను విప్లవాత్మకం చేయడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతున్నదనే విషయాన్ని ఈ పరిశోధన నిర్ధారిస్తున్నదని కిమ్స్ వైద్యులు తెలిపారు. క్యూఎక్స్ఆర్ లాంటి ఏఐ టూల్స్‌తో అంతర్జాతీయ టీబీ గుర్తిం పు ప్రమాణాలను అందుకోవచ్చని చెప్పారు. రోజువారీ చికిత్సావిధానాల్లో వాటి ని జతచేయడంవల్ల వ్యాధులను గుర్తించి, మెరుగైన చికిత్సాఫలితాలు సాధించవచ్చని వివరించా రు. ఏఐ రోజురోజుకు వృద్ధి చెందుతుండడం తో టీబీ లాంటి సాంక్రమిక వ్యాధులపై సమర్థంగా పోరాటం చేయొచ్చని వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ ద్వారా సమర్థమైన చికిత్స అందించేందుకు వీలుంటుందన్నారు.