హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్‌తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ‘పారిశ్రామిక భూముల కన్వర్షన్‌ను దేశంలోనే పెద్ద భూ కుంభకోణం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం సచివాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి, వివరణ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్, లీజ్డ్ ల్యాండ్స్ మధ్య పొంతనలేకుండా కేటీఆర్ ఆరోపణలు చేశారని చెప్పారు. కన్వర్షన్‌కు, భూములకు లింకు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ‘కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టండి’ అంటూ సవాల్ విసిరారు. భూముల కన్వర్షన్, ఇంపాక్ట్ ఫీజుల రూపంలో రూ.4, 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ భేటీలో 30-50 శాతం ఇంపాక్ట్ ఫీజులను నిర్ణయిస్తూ భూముల కన్వర్షన్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. భూములు కావాల్సిన వారు ఫీజులు కట్టుకుంటారని, పరిశ్రమలు కావాలనుకున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సొంత భూములున్న వాళ్లు సైతం కన్వర్షన్ చేసుకోవచ్చని అన్నారు. అజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్‌పేటలోని పారిశ్రామిక భూములకు ఫ్రీహోల్డ్ పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వమే యాజమాన్య హక్కులు కల్పించిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు 2023 ఆగస్టు 20న జీవోను జారీచేశారని తెలిపారు.