బూర్గంపహాడ్, నవంబర్ 17 : రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఇసుక మాఫియా ముఠా దాడి చేసింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం.. బూర్గంపహాడ్ మండలంలోని సారపాకలో బ్రిడ్జి కింద శనివారం అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం రెవెన్యూ అధికారులకు అందింది. వారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ రాంనరేశ్, ఆర్ఐ-1 ముత్తయ్య, రెవెన్యూ సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు.
భాస్కర్‌నగర్, గాంధీనగర్‌కు చెందిన ఇసుక మాఫియా ముఠా సభ్యులు అప్పటికే అక్కడ ఉన్నారు. రెవెన్యూ అధికారులు రాగానే ముఠా సభ్యులు కర్రలతో ఆర్ఐపై దాడికి యత్నించారు. వారిని పట్టుకుంటున్న క్రమంలో ఆర్ఐ కాళ్లను లాగారు. కింద పడటంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే మిగతా అధికారులు అక్కడే ఉన్న ఓ వ్యక్తిని పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఓ ట్రాక్టర్ సహా దాడికి ఉపయోగించిన కర్రలను, ఇసుక రవాణాకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోచమ్మమైదాన్ (వరంగల్), నవంబర్ 17 : ఓరుగల్లుకు చెందిన ప్రముఖ కవి, రచయిత, ప్రొఫెసర్ రామా చంద్రమౌళికి జీవన సాఫల్య పురస్కారం దక్కింది. ఈ నెల 22, 23న దోహా (ఖతార్)లో జరుగనున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.