మోర్తాడ్, ఏప్రిల్ 10 : ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న ఇసుకను పైపుల ద్వారా తవ్వి తీస్తున్నారు. నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి నుంచి ఇసుకను తోడేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వాగుల్లో ఇసుక అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నది. గోదావరిలో సైతం ఇసుక తవ్వకాలు వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. పట్టపగలే తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిలో నీళ్లు లేక, తేలిన ఇసుక మేటలను తోడేయడం సాధారణంగా జరుగుతుండేదే కానీ, ఇక్కడ మాత్రం నీటి అడుగున ఉన్న ఇసుకను సైతం వెలికి తీస్తుండటం గమనార్హం. నదీగర్భంలో ఉన్న ఇసుకను పైపుల ద్వారా పీల్చేలా చేసి ట్రాక్టర్లో నింపి తీసుకెళ్తున్నారు.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులను ఆనుకుని గోదావరి నది ప్రవహిస్తున్నది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ శివార్లలో పారే గోదావరి నది నుంచి కొంతకాలంగా ఇసుకను తోడేస్తున్నారు. అలాగే గోదావరికి అవతలి ప్రాంతంలోనూ ఇలాగే తవ్వి తీసుకెళ్తున్నారు. పట్టపగలు, బహిరంగంగానే అక్రమ తవ్వకాలు సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి నుంచి ఇసుకను తోడేసి, కుప్పలుగాపోసి పట్టణ ప్రాంతాలకు లారీల్లో తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు ఈ అక్రమ దందాను చూసి నోరెళ్లబెడుతున్నారు. అడపాదడపా అధికారులు ఇసుక డంప్లను సీజ్ చేయడం మాత్రమే కనిపిస్తున్నా, గోదావరిలో ఇసుకను తోడేస్తున్న వారిని పట్టుకున్నదీ లేదు, వాహనాలు సీజ్ చేసిందీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు అంతా తెలిసే జరుగుతుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయితే, గ్రామ కమిటీలకు ఎంతో కొంత ముట్టజెబుతూ ఒప్పందాలు చేసుకుని, ఇసుక తీసుకెళ్తున్నట్టు సమాచారం.
నదీ ప్రవాహానికి కింద ఉన్న ఇసుక ఎంతో దోహదం చేస్తుంది. నదిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. జీవరాసుల ఉనికికి ఇసుక అవసరం. నదిలో ప్రవహించే నీరు భూమిలోకి వెళ్లేందుకు ఇసుక తోడ్పడుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి, తీరప్రాంతంలో సాగునీటికి ఢోకా లేకుండా చేస్తుంది. అంతేకాకుండా నీటిలోని కాలుష్యాన్ని ఇసుక నివారిస్తుంది. నది లోపల ఇసుక లేకపోతే ప్రవాహం పెరిగినప్పుడు ఇరువైపులా భూమికోతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇసుక వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండగా, ఎక్కడ దొరకనట్టు నదిలోని ఇసుకను తోడేస్తుండటం అనేక విపరిణామాలకు దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రాక్టర్ ఇంజిన్ ద్వారా మోటర్ ఆన్ చేసి, నదిలో ఇసుక ఉన్న ప్రాంతంలోకి పైప్ వేసి నీళ్లలోని ఇసుకను తోడేస్తున్నారు. నదిలో ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ పైప్ వేసి, వెలికి తీస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే విధానంలో ఇసుకను తోడేస్తుండటంతో గోదావరి నది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి.