జనగామ, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అమలు చేసే బాధ్యత తమదేనని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని మాల మహాసభ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి తాటి కుమార్ మాల అన్నారు.
శుక్రవారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి గెలిపించిన మాలలను రేవంత్రెడ్డి విస్మరించి.. మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో బీజేపీకి మద్దతుగా పనిచేసిన మాదిగల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ ఏకపక్షంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తమ వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెబుతున్న రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తిగా అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అన్నారు. సుప్రీం కోర్డు తీర్పును ఏ విధంగా అమలు చేస్తారో ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.