హైదరాబాద్ జూలై 18 (నమస్తేతెలంగాణ): దశాబ్దాలుగా వలసలతో వలపెట్టిన పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చిందే కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వలస వెళ్లినవాళ్లు.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సొంతూళ్లకు వచ్చి దర్జాగా వ్యవసాయం చేసుకున్నారని తెలిపారు. అసలు ‘కేసీఆర్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసి జూరాల ఆఖరి ఆయకట్టుకూ నీరందించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ సొంతమని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పడావుపెట్టిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుందని మండిపడ్డారు.
కొల్లాపూర్ సభలో బీఆర్ఎస్, కేసీఆర్‌పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు శుక్రవారం ఒక ప్రకటనలో నిరంజన్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తన మామ జైపాల్‌రెడ్డి పేరుపెట్టిన రేవంత్ 19 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ దశాబ్దాల పాలన పాలమూరును వలసలపాలు చేస్తే.. కేసీఆర్ దశాబ్దపు పాలన రివర్స్ వలసకు చిరునామాగా నిలిచిందని తెలిపారు. రేవంత్ చావు భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. పూర్తయిన టెండర్ల రద్దుతో వందల కోట్ల భారం మోపడం దుర్మార్గమన్నారు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినా పట్టించుకునే నాథులే కరువయ్యారని విమర్శించారు.
కోటలు దాటుతున్న రేవంత్ మాటలు
రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు తంగెళ్లు దాటడం లేదని ఎద్ద్దేవా చేశారు. మే నెలలో కృష్ణాకు వరదలు వస్తే ప్రభుత్వం కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. వరదనీటితో జిల్లాలోని సగం చెరువులు, కుంటలు నింపే అవకాశం ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు పాలమూరుకు మేలు చేయడమేమోగానీ.. కీడు చేయకుంటే అదే పదివేలు అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని.. కాంగ్రెస్‌ను రాజకీయంగా ఉరితీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.