Revanth Reddy | మహబూబ్‌నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు… సీఎం రేవంత్‌రెడ్డి. శనివారం మహబూబ్‌నగర్‌లో పలు పనులకు హడావుడిగా పునాదిరాళ్లు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయగా జనం నుంచి పెద్దగా స్పందన కనబడలేదు. రేవంత్‌రెడ్డి మాతరం ఎప్పటిలాగానే అధికారిక కార్యక్రమం పేరుతో రాజకీయ ప్రసంగమే ఊదరగొట్టారు. కానీ సొంత జిల్లాకు రెండేండ్లలో చేసిందేంటో, మూడేండ్లలో చేసేదేంటో మాత్రం చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించిన ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలు, వాస్తవాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. మరీ ఇంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం రేవంత్‌రెడ్డికే చెల్లిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు? ఒక్క కొత్త ప్రాజెక్టుకైనా మంజూరు చేసిందా?
వాస్తవం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా ఫేజ్-1, ఫేజ్-2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల ప్యారలాల్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 2004లో వైఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కానీ పదేండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పాలకులు పనులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందేదికాదు. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, 2018 నాటికే ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2017 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.35 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 లక్ష ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మించారు. ప్రాజెక్టులో శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి నీటిని తోడేందుకు ప్రధాన కాలువతోపాటు నార్లాపూర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టారు. నార్లాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్ 16న కొల్లాపూర్‌లో తొలి దశ పనులను ప్రారంభించారు. బాహుబలి మోటర్లతో 2 టీఎంసీలను రెండు రోజుల్లోనే నిల్వ చేసి చూపించారు.
సీఎం: తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి నేను సవాల్ విసురుతున్న.. మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ.. మంజూరు చేసిన ప్రాజెక్టు కానీ ఒక్కటైన ఉందా?
వాస్తవం: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాకముందు డీపీఆర్‌కు కూడా డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ పథకం పూర్తి చేయకుండా అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కుట్రలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకమే. యుద్ధ ప్రాతిపదికన సర్వేకు నిధులు విడుదల చేసి.. డీపీఆర్ రెడీ చేసి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ 2014లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్‌లో పనులకు వ్యతిరేకంగా కేసులు వేశారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్రలు పన్నారు. అయినా 2017లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. 2023 వరకు ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. అండర్‌గ్రౌండ్‌లో దాదాపు ఐదారు అంతస్తులు లోతుగా పంప్‌హౌస్‌లను ఏర్పాటు చేసి బాహుబలి పంపులను బిగించి.. రోజుకు 2 టీఎంసీలు కృష్ణానది శ్రీశైలంలో డెడ్ స్టోరేజీలో ఉన్న తీసుకునేలా డిజైన్ చేశారు. డ్రైరన్తోపాటు మోటర్లు ఆన్‌చేయడంతో 2023 సెప్టెంబర్ 16న కృష్ణా జలాలు.. ఉబికి వచ్చిన దృశ్యం పాలమూరు ప్రజలకు కండ్లకు కట్టినట్టు కనబడుతున్నది.
సీఎం: డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో వెళ్లి 2023లోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి మంజూరు చేయించారు.
వాస్తవం: తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే కోసం అవసరమైన రూ.100 కోట్ల నిధులను కూడా ఇవ్వకుండా ఆపేశారు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రతి నేత కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకోకుండా పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా కట్టడి చేస్తూ వచ్చారు. మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచి జిల్లాకు చెందిన వాళ్లే ద్రోహం చేశారు. 280 టీఎంసీలు నిల్వ ఉండే శ్రీశైలం జలాలను కాదని.. కేవలం 9 టీఎంసీలు నిల్వ ఉండే జూరాల నుంచి డిజైన్ చేయాలని పాలమూరు ప్రజలను తప్పుదోవ పట్టించింది అప్పటి కాంగ్రెస్ నేతలే. అందుకే ఇప్పటికీ కూడా జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని తీసుకోవాలని డీకే అరుణ సైతం డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జూరాలపై కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి డెడ్ స్టోరేజీలో కూడా నీళ్లు తీసుకునేలా డిజైన్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. వీటిల్లో సుమారు 90 టీఎంసీలు నిల్వ చేసుకునే వెసులుబాటు ఉన్నది. చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ పాలమూరు ప్రాజెక్టును పక్కకు పెట్టి కొడంగల్-నారాయణపేట పథకం పేరుతో కొత్త ఎత్తుగడను ప్రారంభించారని విమర్శలు ఉన్నాయి. భీమాకే నీళ్లు రాని పరిస్థితిలో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎలా తీసుకువస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ చెట్టాపట్టాల్
రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ పట్టించుకోవడంలేదు. బీజేపీ నేతలు విచిత్రంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ఎవరైనా విమర్శలు చేస్తే.. బీజేపీ నేతలే ముందుగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ తంతు చాలా విషయాల్లో కనిపిస్తున్నది. కానీ మహబూబ్‌నగర్ సభలో మాత్రం బీజేపీతో స్నేహానికి రేవంత్‌రెడ్డి సరికొత్త భాష్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ శత్రువులు కాదని, కేవలం ఎన్నికల్లో మాత్రమే కొట్లాడుతామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చెప్పుకొచ్చారు. బీజేపీతో సఖ్యతగా ఉండటం, కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించడం మధ్య తేడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మహబూబ్‌నగర్ సభ మొత్తం అబద్ధాలు, అవాకులు, చెవాకులు, వక్రభాష్యాలతోనే నిండిపోయిందని, రేవంత్‌రెడ్డి మాటల్లో అంతకుమించి ఆశించేది కూడా ఏమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం స్థాయిని దిగజార్చుకుంటున్నారని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
శంకుస్థాపనలు…. వాస్తవాలు
సీఎం: మహబూబ్‌నగర్ నగర పరిధిలో ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రేవంత్‌రెడ్డి చేసిన శంకుస్థాపన
వాస్తవం: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు చేస్తామని ఏడాది కింద చెప్పినా మహబూబ్‌నగర్‌లో ఆలస్యం
సీఎం: రూ.20.5 కోట్లతో ఎంవీఎస్ కళాశాల అదనపు తరగతి గదులకు శంకుస్థాపన.
వాస్తవం: ఇక్కడి స్థలం లాక్కొని యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తూ.. అదనపు గదుల పేరిట మభ్యపెడుతున్నారని విమర్శలు
సీఎం: యూఐడీఎఫ్ నిధులతో మహబూబ్‌నగర్‌లో రూ.220.94 కోట్లతో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన.
వాస్తవం: బీఆర్ఎస్ హయాంలోనే తాగునీటి అవసరాల కోసం నిధుల విడుదల.
సీఎం: మహబూబ్‌నగర్ నగరంలో రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.
వాస్తవం: ఇది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పూర్తయిన కార్యక్రమం. నాటి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇతర రాష్ర్టాలు, దేశాలలో పర్యటించి బృహత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రత్యేకంగా ఎస్టిమేట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం వల్ల మంజూరైన నిధులు రూ.400 కోట్లు. ఈ ఘనత కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
సీఎం: రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన.
వాస్తవం: ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైంది. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేసి, ఆలస్యంగా శంకుస్థాపన చేసింది.