ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ చివరికి హెరిటేజ్ గుట్టల్లో నోట్ల కట్టల వేట మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల్లోకి నీళ్లొచ్చేందుకు ప్రధాన ఆధారమైన గుట్టలను సంరక్షిస్తే ప్రస్తుత రేవంత్ సర్కార్ ఏకంగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నది. ఓవైపు చెరువుల పరిరక్షణకే హైడ్రా తెచ్చామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం, అవే చెరువులకు ఆయువుపట్టుగా ఉండే గుట్టలను తొలుస్తున్నది. కాదేదీ రియల్ ఎస్టేట్ దందాకు అనర్హం అనే చందంగా వ్యవహరిస్తూ రూ. 6 వేల కోట్లు రాబట్టుకునేందుకు చారిత్రక, వారసత్వ సంపదను పణంగా పెట్టింది.
ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్లో 80 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న గుట్టలపై రేవంత్ ప్రభుత్వం కన్నేసింది. తొలి విడతలో 30 ఎకరాల్లో గుట్టలను పూర్తిగా తొలిచి, చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు రంగం సిద్ధం చేసున్నది. అందుకోసం ఇక్కడ రేయింబవళ్లు పదుల సంఖ్యలో బుల్డోజర్లతో గుట్టలన్నింటినీ పిండి చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారసత్వ పరిరక్షణ కమిటీ (హెచ్‌సీసీ),రేవంత్ సర్కార్ నియమించిన సాంకేతిక కమిటీ కూడా ఈ గుట్టలను కాపాడాలని సూచించాయి. కానీ దేన్నీ లెక్కచేయని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో గుట్టలను ధ్వసం చేస్తూ ఇక్కడి దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మూడు బుల్డోజర్లు, ఆరు ధ్వంసాలు.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనకు మచ్చుతునకలు. ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుతున్నామంటూ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతున్నది. మరోవైపు పచ్చని అడవులపైకి, గుట్టలపైకి బుల్డోజర్లు పంపుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది. ఇందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అభయారణ్యంలో సృష్టించిన విధ్వంసమే ప్రధాన సాక్ష్యం. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లను నరికివేయడమూ ఇందులో భాగమే. తాజాగా ప్రభుత్వం రియల్ వ్యాపారం కోసం వారసత్వ, చారిత్రక గుట్టలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నది. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారసత్వ పరిరక్షణ కమిటీ (హెచ్‌సీసీ)తోపాటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ సైతం ఈ గుట్టలను కాపాడాలని సూచించినా లెక్కచేయకుండా బుల్డోజర్లతో గుట్టలను పిండి చేసి, చదును చేస్తున్నది. త్వరలో ఆ భూములను రియల్ అంగట్లో పెట్టి వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువుకు సైతం ముప్పు పొంచి ఉన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం-పాన్‌మక్తా గ్రామ పరిధిలో సర్వే నంబర్లోని 83/1లో నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 430 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అరుదైన, వారసత్వ గుట్టలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండానే లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయించారు. ఆ ప్రాంతంలో భారీ నిర్మాణాలు కూడా వచ్చాయి. కాలక్రమేణా హైదరాబాద్ విస్తరణలో భాగంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ నగరం మధ్యలోకి వచ్చింది. అక్కడ ఉన్న దుర్గం చెరువు పరిరక్షణపై ఉమ్మడి రాష్ట్రంలోనే హైకోర్టు ప్రత్యేక దృష్టిసారించడంతో అప్పటి ప్రభుత్వాలు అనివార్యంగా పరిరక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా నాలెడ్జ్ సిటీ లేఅవుట్లోని వారసత్వ గుట్టలకు రక్షణ వలయం ఏర్పడినట్లయింది. 2013లో వారసత్వ గుట్టల పరిరక్షణకు అప్పటి వారసత్వ పరిరక్షణ కమిటీ దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువుల పరిరక్షణతోపాటు లేఅవుట్లోని గుట్టలను సైతం పరిశీలించి, నివేదిక రూపొందించింది. ఈ గుట్టలను కాపాడటం వల్ల చెరువులకు కూడా మేలు జరుగుతుందని నివేదికలో పేర్కొన్నది. ఇందుకు చేపట్టాల్సిన చర్యలను నివేదికలో సమగ్రంగా పొందుపరిచింది. అందులోని ఎత్తయిన కొండలు, అరుదైన బండరాళ్లతో కూడిన ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని నివేదికలో స్పష్టం చేసింది. అందుకే వాటిని ‘రాతి పరిరక్షణ ప్రాంతాలు’ (రాక్ ప్రిజర్వ్డ్ ప్లేసెస్)గా గుర్తించింది.

నాలెడ్జ్ సిటీ రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో కీలకమైనా పర్యావరణానికి నష్టం కలిగే చర్యలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టలేదు. ప్రధానంగా లేఅవుట్లోని రాతి పరిరక్షణ ప్రాంతాలను అలానే పరిరక్షించింది. కేవలం మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే అవసరమైన చోట గుట్టలను తొలిచి రహదారులు ఏర్పాటు చేసింది. 2013లో వారసత్వ పరిరక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలోనూ మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతరత్రా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టవచ్చనే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగానే భౌగోళికంగా అత్యంత సున్నితమైన, చారిత్రక, వారసత్వ కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో ఐటీ కారిడార్ నుంచి రాయదుర్గం మీదుగా వచ్చిన 100 ఫీట్ల వెడల్పుతో రోడ్లను నిర్మించి మౌలిక వసతులను మెరుగుపరిచింది.
సుమారు ఏడాది కిందటే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్లోని గుట్టలపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. ఆ ప్రాంతంలో భూములకు భారీ డిమాండ్ ఉండటంతో గుట్టలను పిండి చేసి ప్లాట్లుగా చేయాలని నిర్ణయించింది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోని పచ్చని అరణ్యాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసి సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేవంత్ సర్కార్ నిరుడు డిసెంబర్ 16న లేఅవుట్ సవరణపై సాంకేతిక కమిటీని నియమించింది. జేఎన్టీయూ హెచ్ మాజీ వీసీ డాక్టర్ ఎం అంజిరెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ కే శ్రీనివాస్, జేఎన్ఎఫ్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగం ప్రొఫెసర్ ఈ సంధ్యారెడ్డి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్-1 కే విద్యాధర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వారు గతంలో వారసత్వ పరిరక్షణ కమిటీ ఇచ్చిన సూచనలను అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ పర్యటించి హెచ్ఎండీఏకు నివేదిక అందజేశారు. ఇందులోనూ లేఅవుట్లోని వారసత్వ గుట్టలను రక్షించాలని స్పష్టంచేశారు. ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దుర్గం, ఖాజాగూడ చెరువులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా ప్రత్యేక సూచనలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులనే తుంగలో తొక్కడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నది. నాలెడ్డ్ సిటీ లేఅవుట్‌ను సవరించి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేది సర్కార్ ఉద్దేశంగా స్పష్టమవుతున్నది. అందుకే గతంలో వారసత్వ పరిరక్షణ కమిటీ (హెచ్‌సీసీ), ఇప్పటి సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సులకు భిన్నంగా ప్రభుత్వం అక్కడ భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసాన్ని చేపట్టింది. 80 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న గుట్టలను పిండి చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా తొలి విడతలో 30 ఎకరాల్లో గుట్టలను పూర్తిగా తొలిచి, చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందుకే అక్కడ రేయింబవళ్లు పదుల సంఖ్యలో బుల్డోజర్లతో గుట్టలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. వెలకట్టలేని వారసత్వ సంపదను కలిగి ఉన్న రాయదుర్గం లే అవుట్‌లోని గుట్టలను చెరబెట్టి సర్కార్ ఏకంగా రూ. 6 వేల కోట్ల భూపందేరానికి తెరలేపినట్టు తెలిసింది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టలను ఎకరానికి రూ.200 కోట్ల చొప్పున అమ్ముకొని ఏకంగా రూ. 6 వేల కోట్లు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నది. టీజీఐఐసీ గతంలో నిర్వహించిన భూముల వేలంలోనే ఈ లే అవుట్‌కు సమీపంలో ఎకరం రూ.175 కోట్లు పలికింది. కానీ ఇప్పుడు రూ. 6 వేల కోట్లతో ఖజానా నింపుకొనే ప్రయత్నం చేస్తున్నది.
గతంలో పరిరక్షణ కమిటీ ఇచ్చిన సూచనల మేరకే లేఅవుట్లోని ప్లాట్ నంబర్లు 6, 7, 11, 12, 13ల్లో 31.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాతి గుట్టలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలి. వీటిని ఆనుకొని దుర్గం చెరువు ఉన్నందున చెరువు ఎఫ్టీఎల్కు 50 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా రక్షించాలి. ఇందులో 30 మీటర్ల బఫర్‌జోన్‌తో పాటు మరో 20 మీటర్ల ఓపెన్ స్పేస్ ఉంచాలి. ఈ గుట్టలు ఏటవాలుగా ఉండి దుర్గం చెరువుకు ముఖద్వారంగా ఉన్నాయి. అందుకే వీటిని రాక్ ప్రిజర్వ్డ్ ఏరియాగా ప్రకటించాలి. వ్యాలీ ఏరియాతో పాటు ప్రత్యేకమైన రాతి భాగాన్ని పరిరక్షించాలి. దుర్గం చెరువు పక్కనే ఈ రాతి గుట్టలతో అక్కడ అద్భుతమైన భౌగోళిక ప్రదేశంగా ఉన్నది.