సంపదపై కన్నేసిన పొరుగు రాజ్యాలను నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు రేవంత్ సర్కార్ తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్మాణం కుతుబ్‌షాహీల కాలంలో పూర్తయింది. చార్మినార్ చుట్టూ విస్తరించిన విద్య, వైద్య, వాణిజ్య సముదాయాల మధ్య ఎదిగిన నగరానికి కాపుగాసిన రాతి గుండె ఇది.
ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపరుల విధ్వంసంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సిటీ వాల్‌కు మరణ శాసనం లిఖిస్తూ సర్కార్ ‘రివర్ బెడ్’ మార్క్ వేస్తున్నది. పరిరక్షించాల్సిన వారసత్వ కట్టడంపై ధ్వంస రచన చేస్తున్నది.
హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేస్తూ నదిలో చేపల్లా ఈ నగరాన్ని ప్రజలతో నింపమని కులీ కుతుబ్ షా దేవుడిని వేడుకున్నాడు. మూసీలో చేపలు పెరిగినట్టే ఈ నగర జనాభా కూడా భారీగా పెరిగింది. వర్తకమూ అభివృద్ధి పథంలో నడిచింది. ఎంతలా అంటే నగర వీధుల్లో ముత్యాల రాశులు పోసి అమ్మారు. పెరిగిన సంపదతోపాటే సౌధాలూ పెరిగాయి. అంతకంతకూ పెరుగుతున్న ప్రజలను తల్లికోడిలా కాపాడుకుంది హైదరాబాద్‌లోని సిటీ వాల్. శతాబ్దాలపాటు ఈ నగరానికి కాపుకాసింది.
ఓ సైనికుడిలా రక్షణగా నిలిచింది. అలాంటి చారిత్రక ఆ రాతి గోడ ఆనవాళ్లకు ఇప్పుడు పెద్ద ప్రమాదమొచ్చి పడింది. మూసీ నది సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ దందాకు తెగబడిన రేవంత్ ప్రభుత్వం.. చారిత్రక సిటీ వాల్ని ఆసరా చేసుకుని నిర్మించుకున్న పేదల ఇండ్లను ఖాళీ చేసి పోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నది. శతాబ్దాలపాటు నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకొన్న ఈ రాతి గోడలో ఇప్పుడు కొన్ని ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా రేపో మాపో కూల్చేందుకు రేవంత్ సర్కార్ ఉరుకులాడుతున్నది. ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరికలను గోడలపై రాసింది కూడా..
కుతుబ్‌షాహీలు చార్మినార్ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడం వల్ల హైదరాబాద్ నగర అభివృద్ధి మొదలైంది. అలా హస్త కళాకారులెందరికో ఇది ప్రధాన ఉపాధి కేంద్రంగా మారింది. ముత్యాలు, ఆభరణాల పరిశ్రమ వర్థిల్లింది. గోల్కొండ తర్వాత రెండో వర్తక కేంద్రంగా హైదరాబాద్ నగరం (చార్మినార్ ప్రాంతం) దశాబ్దాలపాటు కొనసాగింది. ఎనిమిదో కుతుబ్‌షాహీ అబుల్ హసన్ కుతుబ్ షా (తానీషా) పాలిస్తున్న రోజుల్లో మోఘల్ల ముట్టడితో గోల్కొండ రాజ్యం పతనమైంది. కుతుబ్‌షాహీల కాలంలో వాణిజ్యానికి సహాయ సహకారాలు అందినట్లుగానే.. 1687 నుంచి మొఘల్ చక్రవర్తులు కూడా హైదరాబాద్ (చార్మినార్ ప్రాంతం) అభివృద్ధికి పాటుపడ్డారు. మోఘల్ల సైన్యం ఆగ్రా కేంద్రంగా ఉండేది. మొఘల్ పాలనలోని హైదరాబాద్.. ఔరంగాబాద్ కేంద్రంగా ఉన్న సుబాలో భాగమైంది.

ఇదే సమయంలో ఔరంగాబాద్‌ను గెలుచుకునేందుకు మరాఠాలు తరచూ వ్యూహాలు రచిస్తుండేవారు. కమ్రుద్దీన్ ఖాన్ తర్వాత రెండో అసఫ్‌జాహీగా 1762లో మీర్ నిజాం అలీఖాన్ అధికారం చేపట్టాడు. ఔరంగాబాద్ పట్టణం భౌగోళికంగా సురక్షితమైనది కాదని ఆయన భావించాడు. హైదరాబాద్ నగరం పరిపాలనకు, రక్షణకు భౌగోళికంగా అనువైనదో కాదో పరిశీలించాలని ఓ బృందాన్ని నియమించాడు. ఆ బృందం హైదరాబాద్ నగరాన్ని సర్వేచేసి సుల్తాన్‌కు నివేదించింది.
ఈ సందర్భంలోనే హైదరాబాద్ నగర పటాన్ని (మ్యాప్) రూపొందించారు. అలా హైదరాబాద్ మొట్టమొదటి నక్షా (మ్యాప్) రూపొందింది. ఇందులో నాటి హైదారాబాద్ వీధులు, కట్టడాలు, ప్యాలెస్‌లు, వాణిజ్య సముదాయాలతోపాటు నగరం చుట్టూ ఉన్న రక్షణ గోడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేడు గూగుల్ మ్యాప్‌లో చూసినా హైదరాబాద్ ఈ మ్యాప్‌లో ఉన్న రీతిగానే కనిపిస్తుంది. అంత కచ్చితత్వంతో దానిని రూపొందించారు. అలా అసఫ్జాహీలు రాజధానిని 1763లో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఆ సందర్భంలోనే రెండో నిజాం హైదరాబాద్ రక్షణ గోడకు మరమ్మతులు చేయించాడు. శత్రుసైన్యాల దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రవేశ ద్వారాలను ఆధునీకరించాడు.
భారత ఉపఖండంలో 1750 నాటికి అత్యధిక జనాభా కలిగిన నగరం హైదరాబాద్. ఆనాటి నగర జనాభా 2 లక్షల 25 వేలు. అంతటి వైభవానికి పహారా కాసిన ఓ చరిత్రకు ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కార్ ధ్వంస రచనకు తెగబడుతున్నది.
హైదరాబాద్ నగరం చుట్టూ ఆరుమైళ్ల పొడవున్న రక్షణ గోడకు మొత్తం 13 దర్వాజాలుండేవి. ప్రతి ఉదయం ఈ దర్వాజాలు తెరిచేవారు. సూర్యాస్తమయానికి ముందే తాళాలు వేసేవారు. రాత్రి వేళల్లో ఎవరూ నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతించేవారు కాదు. దర్వాజాల వద్ద విధులు నిర్వర్తించే సైనిక సిబ్బంది విశ్రమించేందుకు, నిద్రించేందుకు, ఆయుధాలు భద్రపరిచేందుకు ప్రత్యేకమైన గదులున్నాయి. పురానాపూల్ దర్వాజా వద్ద నేటికీ ఆ గదులను చూడొచ్చు. కుతుబ్‌షాహీ, నిజాంల పాలనకు సాక్ష్యాలుగా పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
మూసీ నదిలో ప్రయాణిస్తూ శత్రువులు వస్తే పసిగట్టేందుకు నది మలుపు ఉన్నచోట రాతి గోడపై బురుజులు (వాచ్ టవర్) నిర్మించారు. దర్వాజాలను బద్దలు కొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టేలా, దర్వాజాకు ఇరువైపులా ఈ బురుజులు నిర్మించారు. వాటిపై ఫిరంగులను మోహరించేవారు. పీట్ల బురుజుపై ఇప్పటికీ నిజాంల కాలం నాటి ఫిరంగి అక్కడే ఉంది.
ఎగువన 1908లో ఎగువన కురిసిన వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్‌ను ముంచెత్తింది. ఆనాటి వరదల్లో వేలాది మంది మరణించారు. ఈ వరదలకు రాతి గోడ కూడా కొంత కూలింది. వరద బీభత్సంతో ధ్వంసమైన నగరాన్ని పునర్నిర్మించేందుకు నిజాం ప్రభుత్వం 1912లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈనాటి హెచ్ఎండీఏకు మొదటి రూపమైన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ చేపట్టిన మూసీ సుందరీకరణకు లండన్ నగరం ఆదర్శం.


చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మూసీ సుందరీకరణ పేరుతో ఈ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం జరిగింది. సిటీ వాల్‌కు ఉన్న 13 దర్వాజాల్లో ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన మూడింటిలో ఒకటి అఫ్జల్‌గంజ్ దర్వాజాను నగర అభివృద్ధి కోసమని చంద్రబాబు ప్రభుత్వం కూల్చింది. పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే ఇప్పుడు నిలిచి ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలో మళ్లీ కూల్చేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సిటీ వాల్ గోడలపై ఉన్న ఇండ్లను కూలుస్తామని గుర్తులు వేస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్నాయని, వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్నాయని గుర్తులు వేసిన ఇండ్లకు దిగువన సిటీ వాల్ ఉంది.
సుందరీకరణ నిర్మాణాలు సిటీ వాల్ ప్రదేశంలోకి వస్తాయని అధికారుల అనధికార అంచనాలతో పురానాపూల్ దగ్గర మూసీ పక్కన ఉన్న ఇండ్లకు మార్క్ వేశారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా కొత్త నిర్మాణాలు చేపడితే వాల్ ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. పీట్ల బురుజు నుంచి ప్రసూతి దవాఖాన వరకు పాతిక అడుగుల ఎత్తైన సిటీ వాల్ ఇప్పటికీ ఉంది. స్థానికులు దానిని కాపాడుకుంటూ ఇంటికి ప్రహరీలో ఉపయోగించుకుంటున్నారు. పోలీసు శాఖ, రవాణా శాఖల కార్యాలయాలకు కూడా ఇదే ప్రహరీలా ఉంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కట్టడాన్ని ప్రభుత్వం ఒకవైపు ఉపయోగించుకుంటూనే మూసీ సుందరీకరణలో మాత్రం కట్టడమే లేనట్టుగా వ్యవహరిస్తున్నది. చారిత్రక కట్టడాలు కూలుస్తామని పురపాలక శాఖ, హైడ్రా గుర్తులు వేస్తుంటే ఆర్కియాలజీ, హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్ డిపార్ట్మెంట్ మాత్రం స్పందించడం లేదు.
చిన్నప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో చదివిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన చోటు ఇది. అలాంటి మహత్తర ప్రాంతంలో ఇప్పుడు మరో సంగ్రామం జరుగుతున్నది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లతో ప్రజలు తలపడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో హైదరాబాదీలు తలపడబోతున్నారు.
మరాఠాల దాడుల నుంచి స్థానిక వాణిజ్య కేంద్రాలను, సంపదను కాపాడేందుకు మొఘల్ చక్రవర్తులు నగరం చుట్టూ రక్షణ కోసం రాతి గోడ నిర్మించాలనుకున్నారు. దక్కన్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ పర్యవేక్షణలో 1724లో హైదరాబాద్ నగరం చుట్టూ రాతి గోడ నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణాన్ని చాదర్‌ఘాట్ దగ్గర మొదలుపెట్టి నగరం చుట్టూ నిర్మిస్తూపోయారు. నాలుగున్నర మైళ్ల దూరం వరకు నిర్మించిన తర్వాత నాటి రాజకీయ కారణాల వల్ల ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఔరంగాబాద్ కేంద్రంగా దక్కన్ పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న కమ్రుద్దీన్ ఖాన్ 1724లో దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్య్ర రాజ్యంగా ప్రకటించుకుని అసఫ్‌జాహీ రాజవంశాన్ని స్థాపించాడు. ఆయన పరిపాలనా కాలంలో నిలిచిపోయిన రాతి గోడ నిర్మాణం మళ్లీ మొదలైంది. అలా నాలుగున్నర మైళ్ల వరకు నిర్మించిన రక్షణ గోడ నిర్మాణం.. ఆరుమైళ్ల పొడవుతో 1740 నాటికి పూర్తైంది.


నిజాం కాలపు ప్రణాళికల్లో మూసీని విస్తరించాలనే ఆలోచన అప్పటి పాలకులకు లేదు. మూసీ విస్తరణే వరదలకు పరిష్కారమనే భావన కూడా లేదు. అందుకే మూసీలో రాతి గోడలు నిర్మించారు. రహదారులు నిర్మించారు. మూసీ పక్కనే రహదారితోపాటు (నేటి ఉస్మానియా దవాఖాన ఎదురుగా) సిటీ పార్క్ నిర్మించారు. మూసీ వరదల్లో ప్రాణాలు నిలుపుకున్న వాళ్లు ఎక్కిన చింత చెట్టు ఈ పార్కులోనే ఉన్నది. నగర ప్రజలు మూసీ ప్రవాహాన్ని వీక్షిస్తూ ఆనందించాలనే ఉద్దేశ్యంతో మూసీ పక్కన మండపాలు (కియోస్క్‌లు) నిర్మించారు. బాల్కనీలా ఉండే ఇందులో కూర్చునేందుకు అనువుగా బల్లలు ఉన్నాయి. వీటిని నగర అందాన్ని పెంచేలా మొజాయిక్ టైల్స్‌తో అలంకరించారు. ఇప్పటికీ ఆ బల్లలు ఉన్నాయి. పాక్షికంగా ధ్వంసమైన టైల్స్ కూడా కనిపిస్తాయి. కానీ, నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. ఒకనాడు నిజాం పాలకుల వైభవాన్ని చాటిన ఈ రాస్తా.. శిథిలాలతో, వ్యర్థాలతో దయనీయంగా కనిపిస్తున్నది.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మూసీ సుందరీకరణ పేరుతో చేపట్టబోయే పర్యాటక అభివృద్ధి.. నిన్నటి అభివృద్ధి లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంది. అందువల్ల ఇది ఆ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న నిర్మాణాలను కూల్చే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. లంగర్‌హౌజ్ నుంచి ఉప్పల్ వరకు మూసీ ప్రవాహానికి ఇరువైపులా పర్యాటకం, విహారం కోసం అనేక నిర్మాణాలు చేపట్టేందుకు, వరద ప్రమాదాన్ని తగ్గించేందుకు మూసీని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరద నష్ట నివారణ, కాలుష్య నియంత్రణ, సుందరీకరణ పేరుతో ప్రభుత్వం నుంచి ప్రకటనలు తప్ప ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపంలో ఎలా ఉంటుంది? దాని నిర్మాణం ఏవిధంగా చేపడతారో ప్రభుత్వం కానీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవపల్‌మెంట్ అథారిటీ అధికారులు కానీ స్పష్టం చేయట్లేదు.
దశలవారీగా అభివృద్ధి పేరుతో మూసీలో చేపట్టబోయే నిర్మాణాల కోసం ఇండ్ల తొలగింపునకు నోటీసులు మాత్రం ఇస్తున్నారు. కొత్తగా చేపట్టబోయే నిర్మాణాల కోసమని బఫర్ జోన్ పేరిట ఇప్పటికే ఉన్న పేదల ఇండ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఈ లెక్కన ఆ ఇండ్ల పునాదుల కింద ఉన్న సిటీ వాల్‌కు రక్షణ ఉంటుందా? ఇండ్లు, ఆలయాలు, మసీదులు, దర్గాలు ఇతర నిర్మాణాలు తొలగించి వాక్ వేలు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అప్పుడు రివర్ బెడ్, బఫర్ జోన్ నిబంధనలు ఎందుకు వర్తించవని బస్తీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఈ మూసీని, తమ బతుకుల్ని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మిర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సుందరీకరణ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తాను ఖర్చు చేసే నిధులు మూసీకి అందాన్ని, నగరానికి కీర్తినే కాదు ప్రజలకు ప్రయోజనాన్ని ఆశించాడు. హైదరాబాద్ నగరాన్ని లండన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఇస్క్ని నియమించుకున్నాడు. మూసీకి ఇరువైపులా ఎత్తైన భవనాలు ఉండేలా, మరెక్కడా లేని రీతిలో భవనాలకు డిజైన్లు రూపొందించాలని కోరాడు. నిజాం కోరికకు అనుగుణంగా విన్సెంట్ జెరోమ్ ఇచ్ ఎత్తైన బురుజులతో సార్సెనిక్ శైలిలో అద్భుతమైన భవనాలకు నమూనాలు రూపొందించాడు. ఆ నమూనాలకు అనుగుణంగానే నిజాం మూసీకి ఇరువైపులా, సమీపంలో అద్భుతమైన కట్టడాల నిర్మాణం చేపట్టాడు.
హైదరాబాద్ నగర కలికితురాయిగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్, హైకోర్ట్, సిటీ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలన్నీ ఆనాటి స్వప్నాలే. నగర సుందరీకరణలో భాగంగా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్మించిన మొజంజాహీ మార్కెట్‌ని, ముర్గీ చౌక్ (ఫిష్ మార్కెట్)ని ఎంతో అందంగా నిర్మించారు. సిటీ ఇంప్రూవ్మెంట్ చేపట్టే నిర్మాణాలతోపాటు ప్రభుత్వ శాఖలు నిర్మించిన నిర్మాణాల్లోనూ ఇదే స్ఫూర్తిని కనబరిచారు. పబ్లిక్ గార్డెన్, ఇండస్ట్రియల్ మ్యూజియం, హెల్త్ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్, అసఫియా లైబ్రరీ (స్టేట్ సెంట్రల్ లైబ్రరీ) ఈ కోవలోనివే.
– నాగవర్ధన్ రాయల