Bachupally Land Scam | ముఖ్యనేత శాసిస్తే అధికారులు ఎంత గుడ్డిగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నంబర్ 83లో 5.25 ఎకరాల వివాదాస్పద భూమి ఉన్నది. దాని విలువ సుమారు రూ.250 కోట్లని అంచనా. అది సీలింగ్ మిగులు భూమి అని రెవెన్యూ శాఖ ఐదు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నది. కాదు ఆ భూమి తనదేనంటూ పట్టాదారు వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి పేరు అసలు రెవెన్యూ రికార్డుల్లోనే లేదు. 32 ఏండ్ల కిందటే రెవెన్యూ అధికారులు ఆయన పేరును గాయబ్ చేసి ఆ స్థానంలో ఓ కబ్జాదారుని పేరు ఎక్కించారు. పేపర్లపై ఆ భూమి చేతులు మారుతూ వచ్చింది.
ఈ మిగులు భూమి మీద పొరుగు రాష్ట్రపు చినబాబు స్నేహితుడు కన్నేశాడు. చిత్తూరు జిల్లాకు చెందిన అతడి రియల్ ఎస్టేట్ కంపెనీలో చినబాబు బినామీ పెట్టుబడులు ఉన్నట్టు చెప్తున్నారు. అమరావతిలో ఆ బాబుగారు చిటిక వేస్తే.. తెలంగాణ షాడో సీఎంవో పరుగులు పెట్టింది. పాత ఫైల్‌ను వెలికి తీసింది. అధికారులు సాదాబైనామా కాగితాన్ని ముందుపెట్టి, కబ్జాదారుని పేరునే ఖరారు చేస్తూ చట్టబద్ధత కల్పించారు. 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌పరం చేశారు. ఆగమేఘాల మీద ఆ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించి చినబాబు స్నేహితుడి సంస్థకు అప్పగించారు. నాలా కన్వర్షన్ లేకున్నా, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకున్నా సదరు సంస్థ ఆ భూమిలో రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టును చేపట్టింది. ప్రీ లాంచ్ పేరుతో మార్కెట్లో పెట్టి, ఎస్ఎఫ్టీకి రూ.16వేల ధర నిర్ణయించింది.
వాస్తవానికి సర్వేనంబర్‌లో 17.30 ఎకరాలు ఉండాలి. భూ భారతిలో 18.26 ఎకరాలుగా చూపుతున్నది. అంటే రికార్డుల్లో 36 గుంటల భూమి అదనంగా చేరింది. తాజాగా సాదాబైనామాతో 2.30 ఎకరాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు భూమి 3.26 ఎకరాలకు పెరిగింది. భౌతికంగా భూమి లేకున్నా చినబాబు స్నేహితుడి సంస్థ రికార్డులు పట్టుకొని సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకున్నది. వీళ్లు ఇక్కడితో ఆగడం లేదట. ఆ భూమి సమీపంలో ఉన్న 27 ఎకరాలను మడత పెట్టేందుకు స్కెచ్ వేశారట. ఇప్పటికే ఇదంతా పెద్దల ఆధీనంలోకి వెళ్లిపోయిందని సమాచారం.
2.30 ఎకరాల ఫైల్ మొత్తం 8మంది అధికారుల చేతులు మారింది. ఏ ఒక్కరు నిశితంగా పరిశీలించినా, ఆ భూమి, తాము కాపాడుతున్న ట్టు కోర్టులకు చెప్తున్న భూమి ఒకటేనని అర్థం అయ్యేది. కానీ పైనుంచి ఆదేశం, షాడో సీఎంవో ఒత్తిడి కారణంగా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు పనిచేసుకుంటూ పోయారు.
(వర్ధెల్లి వెంకటేశ్వర్లు)
హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అ త్యంత విలువైన ఈ భూముల మీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసినట్టు తెలిసింది. ఆయన తెలంగాణ ముఖ్యనేత సాయం కోరారని, వెంటనే షాడో సీఎంవో నేత రంగంలోకి దిగారని చెప్పుకొంటున్నారు. ఆయన ఒత్తిడి మేరకు లేని భూమి విస్తీర్ణాన్ని కాగితాల మీద సృష్టించటంతో పాటు, నిషేధిత జాబితాలోంచి ఈ భూమిని తొలగించి రియల్ ఎస్టేట్ సంస్థకు బదలాయించారు. ఈ భూమి ధర రూ.250 కోట్లు ఉంటుందని అంచనా.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి గ్రామం సర్వే నెంబర్ 83లో మొత్తం 17.30 ఎకరాల రక్బా ఉన్నది. జాగిర్దార్ జుల్ఫీకర్ అలీ పట్టాదారుడు. ఈ మొత్తం భూమిని 1966లో ఆయన రిజిస్టర్ సేల్‌డీడ్ ద్వారా ముగ్గురు వ్యక్తులకు విక్రయించారు. అనంతరం కుటుంబంతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. భూమిని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే అసలు కథ మొదలైంది. ముగ్గురు కొనుగోలుదారుల్లో ఒకడైన వెంకట్రామయ్య తనకు మొత్తం 116 ఎకరాల పట్టా భూమి ఉన్నట్టు ప్రకటించారు. దీంతో నిబంధనల ప్రకారం ఇందులో నుంచి 27 ఎకరాలు సీలింగ్ చట్టం పరిధిలోకి వెళ్లింది. అలా వెళ్లిన భూమిలో సర్వే నంబర్ 83లో 5.25 ఎకరాలు ఉన్నాయి. సీలింగ్ వివాదంపై వెంకట్రామయ్య కోర్టుకు వెళ్లారు. కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. వాదోపవాదాలు జరుగడం, కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద పైకోర్టులకు వెళ్లడం ఇలా ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నది. వెంకట్రామయ్యకు చెందిన 27 ఎకరాల సీలింగ్ భూమి 1976 నుంచి ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది.
నార్త్‌వెస్ట్ నగరం ప్రాంతంలో కబ్జాదారుగా ఆ కాలంలోనే గుర్తింపు పొందిన ఓ నేత కన్ను ఈ భూమిపై పడింది. అతడి ప్రణాళిక మేరకు ఎంఏ ఖయ్యూం అనే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. 1970 మార్చి 30న తాను జుల్ఫీకర్ అలీ నుంచి 6.25 ఎకరాలను సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసినట్టు రికార్డులు పుట్టించారు. సాదాబైనామా రాసుకున్న 18 ఏండ్లకు.. అంటే 1989లో 13బీ సర్టిఫికెట్, తర్వాత 1992లో 13సీ సర్టిఫికెట్ పొందినట్టుగా పత్రాలు సృష్టించారు. కానీ పహాణీల్లో ఆయన పేరు ఎక్కించడానికి సాధ్యం కాలేదు. చట్టబద్దమైన సేల్‌డీడ్ ద్వారా వచ్చిన ముగ్గురు ఓనర్లతో రక్బా అంతా నిండటంతో సాదాబైనామాతో వచ్చిన ఖయ్యూం పేరు రికార్డుల్లోకి ఎక్కించడానికి అవకాశం లేకపోయింది.
దీంతో అప్పటి రెవెన్యూ అధికారులు సర్ప్లస్ సీలింగ్ కింద ఉన్న వెంకట్రామయ్య పేరును రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి, ఖయ్యూం పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు కక్కుర్తిపడి రికార్డులు టాంపరింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మలుపులు తిరిగింది. మొదట ఖయ్యూం పేరు మీది నుంచి భూమి కబ్జాపెట్టిన నాయకుని బామ్మర్ది పేరు మీదికి, తర్వాత ఆయన భార్య పేరు మీదికి మారింది. 2011లో ఒక రియల్ సంస్థకు అగ్రిమెంట్ చేసుకొని, తర్వాత రద్దు చేసుకున్నది. దీంతో ఎకరాల నుంచి గజాల్లోకి మార్చారు.
విచిత్రం ఏమిటంటే ఏ ఒక్క అధికారి కూడా కనీసం ఫైల్ తెరిచి చదువకుండా గుడ్డిగా సంతకం పెట్టినట్టు చెప్తున్నారు. చినబాబు స్నేహితుడి సంస్థ కొనుగోలు చేసిన 2.30 ఎకరాల భూమి సాదాబైనామా ద్వారా పుట్టింది. అంటే.. ప్రభుత్వం రక్షిస్తున్న వెంకట్రామయ్యకు చెందిన సీలింగ్ భూమి. 1994 వరకు రెవెన్యూ పహాణీల్లో వెంకట్రామయ్య పేరు కొనసాగుతూ వచ్చింది. ఖయ్యూం అనే వ్యక్తి సాదాబైనామా ద్వారా వచ్చిన తర్వాత వెంకట్రామయ్య పేరును తొలిగించారు. ఏ ఒక్క అధికారి ఫైల్‌ను నిశితంగా పరిశీలించినా.. తాము కోర్టుల్లో కొట్లాడుతున్న భూమి, ఈ భూమి ఒకటే అనే విషయం బయటపడేది. కానీ ఒక్కరు కూడా ఫైల్ చూడకుండా సంత కం పెట్టినట్టు అర్థం అవుతున్నది. పైగా రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసిన భూమి సర్వే నెం.83లో ఉన్నా, అది సీలింగ్ పరిధిలోకి రాదని పేర్కొంటూ 22ఏ నుండి డీ-నోటిఫై చేశారు. దీంతో 2.30 ఎకరాలు చినబాబు స్నేహితుడి సంస్థ వశమైందని చెప్తున్నారు. సర్వే నెంబర్లో భౌతికంగా భూమి లేకున్నా రికార్డులు పట్టుకొని సీలింగ్ భూమిలో కూర్చున్నారని అంటున్నారు.
ఒకవేళ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆ భూమి సీలింగ్ మిగులు పరిధిలోకి రాకపోతే.. 1966లోనే 157/1966 నెంబర్ రిజిస్టర్ డాక్యుమెంటు ద్వారా ఆ భూమిని కొనుగోలు చేసిన వెంకట్రామయ్యకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అలా చేయలేదు. విచిత్రం ఏమిటంటే ఇదే రెవెన్యూ అధికారులు వెంకట్రామయ్యకు చెందిన 5.25 ఎకరాలు సీలింగ్ భూమి అంటూ దిగువ కోర్టుల్లో, ఎగువ కోర్టుల్లో ఇప్పటికీ కొట్లాడుతున్నారు. అదే సీలింగ్ రికార్డుల నుంచి పుట్టించిన సాదాబైనామాతో వచ్చిన వ్యక్తులకు మాత్రం నిరభ్యంతరంగా భూమిని కట్టబెట్టారు. దీంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. వాస్తవానికి 83 సర్వే నంబర్లో మొత్తం భూమి 17.30 ఎకరాలు మాత్రమే.
ఇందులో నిమ్మగడ్డ రామనాథంకు 5.10 ఎకరాలు, వేముల కృష్ణమూర్తికి 6.35 ఎకరాలు, కోడూరు వెంకట్రామయ్యకు 5.25 ఎకరాలు ఉన్నదని రెవెన్యూ అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ కోర్టులకు అఫిడవిట్ కూడా ఇచ్చారు. భూ భారతి నివేదికల ప్రకారం 83 సర్వే నెంబర్లో 18.26 ఎకరాలు చూపిస్తున్నది. అంటే రికార్డుల్లో ఇప్పటికే 36 గుంటల భూమి అదనంగా నమోదై ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ 2.30 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో నాలుగో వ్యక్తి పట్టా మీదికి వచ్చారు. అంటే దీంతో సర్వే నెంబర్ వాస్తవిక రక్బా కంటే మొత్తం కలిసి 3.36 ఎకరాలు భూమి రికార్డుల్లో పెరిగింది.
వీళ్ల ఆలోచన ఈ ఒక్క 2.30 ఎకరాలు మాత్రమే పరిమితం కాదని, 83 సర్వే నెంబర్‌ను ఆనుకొని సర్వే నెంబర్ 132లో ఉన్న సీలింగ్ భూమి, దాని పక్కనే 131లో ఉన్న ప్రభుత్వ భూమి.. మొత్తంగా 27 ఎకరాల సీలింగ్ భూమికి స్కెచ్ వేసినట్టు చెప్తున్నారు. ఇందులో 4 వేల చదరపు అడుగుల భూమిని ఇప్పటికే చినబాబు స్నేహితుని రియల్ ఎస్టేట్ కంపెనీ పొతం పెట్టినట్టు తెలుస్తున్నది. రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. నాలా కన్వర్షన్ లేకపోయినా, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకపోయినా ప్రీ లాంచ్ పేరుతో మార్కెట్లో పెట్టారు. ఎస్ఎఫ్టీకి రూ.16 వేల ధర నిర్ణయించారు. కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసిన వారికి మరుసటి నెల నుంచి రెంటు చెల్లింపు అనే ఆఫర్ కూడా పెట్టారు. ఇది పోగా మిగిలిన సీలింగ్ మీద ముఖ్యనేత సోదరుల్లో ఒకరు కన్నేసినట్టు సమాచారం. ఇప్పటికే సర్వే నెంబర్ 132లోని సీలింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నట్టు స్థానిక ప్రజలు చెప్తున్నారు. పనిలో పనిగా దాని పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యక్తి రామనాథం భూమిని కూడా కబ్జాలోకి తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి హైదరాబాద్‌లోని నార్త్‌వెస్ట్ సిటీ భూ దందాల మీద పొరుగు రాష్ర్టానికి చెందిన తెలుగుదేశం నేతల హవానే కొనసాగుతున్నది. పొరుగు రాష్ట్రపు చినబాబు కనుసన్నల్లో మెలిగే నలుగురు వ్యక్తులు తెలంగాణ ముఖ్యనేతకు కూడా అత్యంత సన్నిహితులుగా గుర్తింపు ఉన్నది. వాళ్లే నార్త్‌వెస్ట్ సిటీ ప్రాంతంలో భూ కబ్జాలు, అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. 2023లో చినబాబు మిత్రునికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సదరు వివాదాస్పద భూమిలో 2.30 ఎకరాలను కొనుగోలు చేసింది. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో చినబాబు రహస్య పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. స్నేహితుని అభ్యర్థన మేరకు చినబాబు ఆ భూమి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యనేత సహాయం కోరినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ముఖ్యనేత వెంటనే స్పందించి షాడో సీఎంవోలోని అత్యంత నమ్మకస్తుడు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా భూ వివాదాల వ్యవహారాలను చూసే ఓ రెడ్డి సామాజికవర్గం నేతకు అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ జిల్లాలో వేల ఎకరాలు సెటిల్ చేసినట్టు సదరు రెడ్డి నేతకు గుర్తింపు ఉన్నది. ఆయన రంగంలోకి దిగి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. దీంతో బాచుపల్లి తహసీల్దార్ ఆఫీస్ మొదలు కలెక్టర్ కార్యాలయం వరకు రెవెన్యూ రికార్డు పరుగులు పెట్టిందని, దాదాపు 8 మంది అధికారుల వద్దకు ఫైల్ వెళ్లిందని సమాచారం.
వెంట్రామయ్య పేరును రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి, సాదాబైనామా ద్వారా వచ్చిన వ్యక్తి పేరు చేర్చారనే విషయం ఇప్పటివరకు తన దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. బాచుపల్లి తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే నెంబర్ 83లోని 2.30 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చానని చెప్పారు. ఐదున్నర శతాబ్దాలుగా వెంకట్రామయ్యకు చెందిన సీలింగ్ భూముల మీద కోర్టుల్లో కొట్లాడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వెంకట్రామయ్య పేరు తొలగించి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వ్యక్తుల పట్టా హక్కులకు చట్టబద్ధత ఉండదని వివరించారు. విచారణలో నిజమని తేలితే సాదాబైనామా ద్వారా వచ్చిన పట్టా పుస్తకాలతో పాటు, తాను జారీచేసిన ఎన్వోసీని కూడా రద్దు చేస్తానని తెలిపారు.
– మనుచౌదరి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్
సర్వేనం.83లోని కొంత భూమిని డీ నోటిఫై చూస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రకటన