ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల పథకాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రజలు కోరుకున్నవి. వాళ్లకు అత్యవసరమైనవి. అందుకే కేసీఆర్ వాటిని తన మొదటి ఎజెండాగా తీసుకున్నారు. తీసుకోవడమే కాదు.. ఆయా పథకాలను పూర్తి చేసి, సమస్యలను పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆస్తుల కల్పన కోసం అవసరమైతే అప్పులు కూడా చేసారు!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. స్కూళ్లు, దవాఖానలు, రోడ్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ప్రజలు కోరుకునే, ప్రజోపయోగమైన పనులపై దృష్టిపెట్టాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్మాణాత్మక పనులు వదిలిపెట్టి సుందరీకరణపై దృష్టిపెట్టింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి..రూ.లక్షన్నర కోట్ల అప్పును తెలంగాణ బిడ్డల మీద పెట్టేందుకు సిద్ధమైందని విమర్శిస్తున్నారు. పేదల గుడిసెలు పీకేసి.. మధ్యతరగతి ప్రజలు ఇటుక ఇటుక పోగేసి కట్టుకున్న ఇండ్లను కూల్చేసి.. వేలాది మంది ఉద్యోగుల జీవితకాల కష్టాన్ని మూసీలో జలస్థాపితం చేస్తూ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ‘సుందరీకరణ’ రాగం ఎందుకు ఎత్తుకున్నట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు మూసీ సుందరీకరణను తెరమీదికి ఎందుకు తెచ్చారనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఈ ప్రాజెక్టు లేదు.. రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించలేదు.. రాహుల్ గాంధీనో, ప్రియాంకగాంధీనో హామీ ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరి హఠాత్తుగా తెరమీదికి తెచ్చి, బుల్డోజర్లను ప్రయోగించి, వివాదాస్పద కంపెనీకి పనులు కట్టబెట్టి నానాయాగీ ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావడం లేదని అంటున్నారు.
నాటి కాంగ్రెస్కు.. రేవంత్ కాంగ్రెస్కు ఎంతో తేడా
వాస్తవానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కొత్తదేం కాదన్నది నిపుణుల మాట. ఉమ్మడి రాష్ట్రంలో 1990వ దశకం నుంచి మూసీ సుందరీకరణకు, నదీపరీవాహకంలోని ఆక్రమణలు ఖాళీ చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వాలు రూ.వందల కోట్లలో ఖర్చుచేశాయని, అయినా పూర్తి కాలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కేవీపీ రామచందర్రావు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని అనుకున్నారని, అయితే ఆర్థిక భారం గురించి ఆలోచించి వెనక్కి తగ్గారని చెప్పారు. అంటే ఉమ్మడి రాష్ట్రమే మోయలేనంత ఆర్థిక భారాన్ని తెలంగాణ నెత్తిమీద మోపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఆర్థిక భారం కావొద్దని నాటి కాంగ్రెస్ భావిస్తే.. రాష్ట్రం ఆగమైనా సరే మా ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ కాంగ్రెస్ భావిస్తున్నదని విమర్శిస్తున్నారు.
నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?
మూసీ సుందరీకరణకు రూ.8 వేల కోట్లు వ్యయం అవుతుందని 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యయం ఏకంగా 19 రెట్లు పెరిగి రూ.లక్షన్నర కోట్లకు చేరిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయిలో ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదని అంటున్నారు. పైగా.. రాష్ర్టానికి స్థిరంగా మంచి ఆదాయం వచ్చి, మిగులు బడ్జెట్ ఉన్నప్పుడే సుందరీకరణ వంటి పనులు చేపడుతుంటారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ర్టానికి రాబడి రోజురోజుకూ తగ్గుతున్నదని స్పష్టం చేస్తున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రెండు నెలలుగా 20-30 శాతం తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.73 వేల కోట్ల వరకూ అప్పులు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా భావిస్తున్న మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్ల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచబ్యాంకు, జైకా తదితర అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తామని ప్రభుత్వం చెప్తున్నదని.. అయితే ఆయా సంస్థలు సవాలక్ష కొర్రీలు, షరతులు విధిస్తాయని చెప్తున్నారు. వాటి నిబంధనలను తలొగ్గి, వాళ్లుచెప్పినట్టల్లా తలాడిస్తూ సుందరీకరణ చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలన్నీ తుంగలో తొక్కాల్సిన అవసరం ఏమున్నది?
ఒకవేళ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని సంకల్పిస్తే.. ఇప్పుడు చేసే విధానం సరైనది కాదన్నది విశ్లేషకుల మాట. ముందుగా నీటిని శుద్ధి చేసి, ఆ తర్వాత సుందరీకరణ చేయాలని.. మొదట మూసీ పరివాహకంలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టి, ఆ తర్వాత కూల్చివేతలు జరపాల్సి ఉంటుందని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలు చేయాల్సిన పనులను వదిలిపెట్టి.. కేవలం కూల్చివేతలపై దృష్టిపెట్టడం వెనుక మతలబు ఏమిటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూసీలో మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక రసాయనాలు కలవడం నిత్యకృత్యమని గుర్తు చేస్తున్నారు. ఆయా వ్యర్థాలు, రసాయనాలను నదిలో కలువనీయకుండా ఉంచుతూ.. సీవరేజీ వ్యవస్థను కచ్చితంగా నిర్వహిస్తేనే మూసీ శుద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం నీళ్ల శుద్ధి గురించి ఇప్పటివరకు ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదని మండిపడుతున్నారు. ఇక మూసీ పరివాహకంలోని ఇండ్లను ఖాళీ చేయాలన్నా, ప్రజలను తరలించాలన్నా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, వారికి ప్రత్యామ్నాయం చూపించడం వంటివి చేసిన తర్వాతే కూల్చివేతలు జరపాల్సి ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం ఏకంగా రెడ్ మార్కింగ్ వేసి, బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ పద్ధతి పాడు లేదా?’ అంటూ మండిపడుతున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇండ్లు కూల్చాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
అందరూ వ్యతిరేకిస్తున్నా..
సాధారణంగా ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టేముందు ప్రజల నుంచి, మేధావుల నుంచి, ప్రజా సంఘాల నుంచి, వివిధ వర్గాల నిపుణుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటాయి. కానీ.. రేవంత్ సర్కార్ ఎవరినీ సంప్రదించకుండానే హడావుడిగా సుందరీకరణ ప్రాజెక్టును తెరమీదికి తెచ్చిందని చెప్తున్నారు. వాస్తవానికి మొదట్లో కొన్ని ప్రజాసంఘాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని భావించాయని.. అయితే ప్రాజెక్టును చేపడుతున్న విధానం, ప్రజల కోసం కాకుండా ఎవరి లబ్ధి కోసమో అన్నట్టుగా మొండిగా వ్యవహరించడం వంటి పరిణామాలతో వారిలో అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. అందుకే మేధావులు, ప్రజాసంఘాలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేయడం, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుండటంతో ఒక్కొక్కరుగా బయటికి వచ్చి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారని చెప్తున్నారు. ఇటీవల వీక్షణం వేణుగోపాల్, జేపీ వంటి వారు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. చివరగా.. సీఎం సొంత జిల్లాకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పక్కన పడేసి మూసీ సుందరీకరణ ఎందుకు చేపట్టినట్టు? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించి, లక్షల మంది పాలమూరు ప్రజల కన్నీళ్లు తుడవగలిగే ప్రాజెక్టును ఆగం పట్టించి, లక్షల మంది ప్రజల ఉసురుపోసుకుంటూ మూసీ సుందరీకరణను మొండిగా ముందుకు తీసుకుపోవడం వెనుక అంతరార్థం ఏమిటని చర్చిస్తున్నారు.