తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డిది చేతకానితనం. వరదలు వచ్చిన 24 గంటలు ఎక్కడున్నవ్. సచివాలయానికి వచ్చినవా? అధికారులతో రివ్యూలు చేసినవా? వర్షం బీభత్సం నాడు ఎక్కడున్నవ్? నీ వైఫల్యం బురదను ప్రతిపక్షాలకు అంటిస్తున్నవ్. -హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వాతావరణశాఖ హెచ్చరించినా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయడంలో, సహాయం అందించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని ఆరోపించారు. వరద తగ్గి 48 గంటలైనా నేటికీ కరెంట్ సరఫరా లేదని, పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 9 మందిని గెలిపిస్తే కనీసం తొమ్మిది మందిని కాపాడలేకపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి వ్యంగ్యం ఎకువ, పనితనం తకువ అని ఎద్దేవా చేశారు. మృతుల సంఖ్యను కూడా కాంగ్రెస్ సర్కారు తక్కువ చూపుతున్నదని, భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోతే, 16 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నదని మండిపడ్డారు. మృతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, వరదలో పూర్తిగా మునిగిన ఇండ్లకు తక్షణమే రూ. 2 లక్షలు సాయం చేయాలని, పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు రూ.50 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రతినిధులు మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇతర నేతలు పర్యటించారు. అనంతరం ఖమ్మంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తరఫున వరద బాధితులకు ఇతోధికంగా సహాయం అందిస్తామని చెప్పారు. బుధవారం నుంచి లారీల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు పంపిస్తామని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ బృందంపై దాడులు చేయడం ఏమిటని నిలదీశారు. తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వరద బాధితులకు సహాయం అందించడానికి, ప్రభుత్వ చర్యలను పరిశీలించడానికి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. సీఎం వచ్చి తమను అదుకుంటారనుకుంటే కనీసం తమ బాధను కూడా వినలేదని బాధితులు వాపోయారని పేర్కొన్నారు.
తమ హయాంలో మైక్‌ల ద్వారా ముందస్తుగా అలర్ట్ చేయడం, యంత్రాంగం సహాయ సహకారాలు అందించడంతో ఇంత నష్ట జరుగలేదని, ఇప్పుడు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదని ప్రజలు చెప్పారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వర్షాలు పడబోతున్నాయని వాతావరణశాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరిగిందని చెప్పారు. అనేక ఇండ్లు పూర్తిగా నీటమునిగి రూ. దాదాపు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. ఇంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసిపోయాయని కన్నీరుమున్నీరు అవుతున్నారని, కష్టపడి సంపాదించుకున్న బంగారం సైతం కొట్టుకుపోయిందని కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. పూర్తిగా ఇండ్లు మునిగిన బాధితులకు రూ.10 వేల సాయం ఏమూలకూ సరిపోదని, రూ.2 లక్షల తక్షణసాయం అందించాలని డిమాండ్ చేశారు.
మృతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం
వర్షాల మృతుల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గించాలని చూస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోతే, 16 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే తొమ్మిదిమంది చనిపోయారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి పేర్లను మీడియా ఎదుట హరీశ్‌రావు చదివి వినిపించారు. పాలమూరు ఎత్తిపోతల మునిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాగర్ కెనాల్ రెండు చోట్ల తెగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఎస్కేప్ కెనాల్‌ను ఓపెన్ చేసి ఉంటే సాగర్ కాలువ తెగి ఉండకపోయేదని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేసినట్టుగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పన నష్టపరిహారం ఇవ్వాలని, చాలాచోట్ల పొలంలో ఇసుక మేటలు వేశాయని, వారికి రూ.50 వేలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ బాగా ఆదుకున్నారని, సాయంచేశారని, వందల మంది ప్రజలు తమ పర్యటనలో చెప్పినట్టు పేర్కొన్నారు.
దాడులు చేయడమే ప్రజాపాలనా?
కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ముఖ్యమంత్రి సహా ముగ్గురు జిల్లా మంత్రులు, ఇద్దరు బయటి మంత్రులు ఉపన్యాసాలు కొట్టారు తప్ప సాయం అందించే ప్రణాళిక గురించి మాట్లాడారా? అని హరీశ్‌రావు నిలదీశారు. అది ప్రతిపక్షాలను తిట్టడంతోనే సరిపోయిందని విమర్శించారు. ఇక్కడి ముగ్గురు మంత్రులు ఫెయిల్ అవడంతోనే సీఎం వచ్చారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ అమ్మాయి మీద దాడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదా కాంగ్రెస్ పాలన, దాడులు చేయడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. పిచ్చి చర్యలకు, పిచ్చి చేష్టలకు దాడులకు బెదిరిపోబోమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో తలపెట్టిన రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ 3 వేల మందికి, ఎంపీ రవించంద్ర 3 వేల మందికి, పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కూడా వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఫెయిలైనా ప్రాణాలకు తెగించి పలువురి ప్రాణాలు రక్షించిన ఏడుగురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
చిల్లరవేషాలు మానుకో రేవంత్: జగదీశ్‌రెడ్డి
దాడులతో ప్రజల చైతన్యాన్ని అణచివేయలేరని, చిల్లర వేషాలు మానుకోవాలని రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హితవుపలికారు. పువ్వాడ కారుపై, తమపై కూడా దాడులకు యత్నించారని, రౌడీయిజం, గూండాయిజంతో తమను అణచివేయలేరని స్పష్టంచేశారు. సాయం విషయాన్ని పక్కదారి పట్టించడానికి దాడులు చేయిస్తున్నారని, ప్రతిపక్ష బృందంపై దాడియత్నం పిరికితనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. నీతులు చెప్పే తుమ్మల నాగేశ్వర్రావు ఈ దాడిపై స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను కాన్వాయ్ ముందుకు తోసి చంపేప్రయత్నం చేశారని, ఆ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ‘మేము వస్తేనే మీకు లాగులు తడుస్తున్నయ్. మరి కేసీఆర్ వస్తే.. మీ పరిస్థితి ఏట్లుంటదో. మేం వస్తే ఎందుకు వణుకుతున్నవ్? ఏ రకంగా దాడిచేయిస్తవ్? ఎక్కడో కౌన్సిలర్ మరోచోటకు వచ్చి ఎలా దాడి చేస్తరు? సీఐ ఎదుటే కారుపై దాడులు ఎలా చేస్తారు? దీని సీపీ విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. ఇందులో పోలీసులు పాత్రపై విచారణ జరపాలి. పర్యటనలో రాని పోలీసుల దాడి సమయంలో ఎందుకొచ్చారు? ప్రజలకు సహాయం చేస్తాం.. దాడులను పట్టించుకోం. ప్రజలతోనే మీకు బుద్ధి చెప్పిస్తాం’ అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
వీటికి భయపడితే తెలంగాణ వచ్చేదా?: పువ్వాడ
దాడులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మూడు రోజులుగా అల్లాడుతున్న మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ బృందంపై దాడి చేయడం హేయమని మండిపడ్డారు. సీఎం ప్రజలకు స్వాంతన కల్పించి ఆర్థికసాయం చేస్తారనుకొంటే రూ.10 వేలు ప్రకటించారని, అవి ఎక్కడ సరిపోతాయని నిలదీశారు. బీఆర్ఎస్ బృందంపై హత్యాయత్నం చేయడం శోభనిస్తదా? అని ప్రశ్నించారు. తక్షణం నిందితులపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్దకు వెళ్లకుండా తమను అడ్డుకోవడం మీ తరంకాదని స్పష్టంచేశారు. ప్రజ్వాస్వామ్యవాదులు దాడులను ఖండించాలని విజ్ఞప్తిచేశారు.
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
వర్షాల మృతులకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని ఇదే రేవంత్, సీతక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారు. ఆ మాట ప్రకారం తక్షణమే బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. మాట మీద నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. వరద సహాయక చర్యల్లో కేంద్రం కూడా విఫలమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, హెలికాప్టర్లను పంపలేకపోయింది. అఖిలపక్షాన్ని రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్లాలి. మోదీని నిలదీద్దాం. సహాయం ఎందుకు చేయరో అడుగుదాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు బలయ్యారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రం బడ్జెట్టు ఇస్తలేదంటే.. కేసీఆర్ దీక్ష చేయాలంటరు. రైతు రుణమాఫీ కాలేదంటే హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కాగితాలు జమచేసి ఇవ్వాలంటరు. వరదలు వచ్చినయ్ సాయం చేయాలంటే, బీఆర్ఎస్ చేయాలంటరు. సరే అన్ని మేమే చేస్తాం.. సీఎం కుర్చీలో మీరెందుకు? -హరీశ్‌రావు