హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత వేటు తప్పక పోవచ్చని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చి నా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ భేటీకి హాజరయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ భేటీకి గైర్హాజరైనట్టు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మిగ తా ఎమ్మెల్యేలు నోటీసులపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని సమాచారం. దీంతో సీఎం వారితో సమావేశం కావడం గమనార్హం.
పనీలేదు.. పతార లేదు
భేటీ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నమ్మి వచ్చిన తమను నట్టేట ముంచవద్దని సీఎంను వేడుకున్నట్టు తెలిసింది. స్పీకర్ నోటీసులు తమను ఇరికించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో గొడవలు, నేతల మధ్య విభేదాలను వారు రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అంతేకాదు, తమకు పనీలేదు, పతార లేదని, ఎందుకొచ్చామో అర్థం కావడం లేదని సీఎం ముందు తలపట్టుకున్నట్టు సమాచారం.
పార్టీ మారి వచ్చిన తమను కాంగ్రెస్ పాత కార్యకర్తలు, నేతలు ఇంకా శత్రువులుగానే చూస్తున్నారని వాపోయారట. బాన్సువాడలో ఏనుగు రవీందర్‌రెడ్డి, బాలరాజు వర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. గద్వాలలో సరితాయాదవ్ అడుగడుగునా తనను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని, పోలీసు బదిలీలు, అధికారుల బదిలీలు అన్నీ నియోజకవర్గ ఇన్చార్జీలు చెప్పినట్టే జరుగుతున్నాయని, అధికారులు తమను లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని, మహిళలు రూ. 2,500 ఇచ్చే ఇందిరమ్మ అభయహస్తం కోసం ఎదురుచూస్తున్నారని ఏకరవు పెట్టినట్టు తెలిసింది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలకు వెళ్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
ఆ ఇద్దరి పేర్లు బయటపెట్టిన సీఎం
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పందించిన రేవంత్‌రెడ్డి నేతల మధ్య విభేదాల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. పరిష్కార బాధ్యతను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఒకటి రెండు రోజుల్లో న్యాయ నిపుణులను ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యేల నోటీసులకు వారే సమాధానాలు రాస్తారని చెప్పినట్టు తెలిసింది. అలాగే, పదిమంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. వారి పేర్లను కూడా ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం. మిగతా 8 మందికి ప్రభుత్వం తరఫున ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనర్హత వేటు పడిన వారికి పార్టీ బీఫారాలు ఇచ్చి గెలిపించుకుంటామని, వారి మంచిచెడ్డలు అన్నీ పార్టీ చూసుకుంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం.