మేడ్చల్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేయడానికి కుప్పలు, తెప్పలుగా అప్పులు( Debt ) చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KCR ) పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు ( Congress Councillors ) బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర యేండ్ల కాలం అయిందని, ఎన్నికల ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇంకా నేరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలతో గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారని, తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదని, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయిందని పేర్కొన్నారు.

హైదరాబాద్లో దొంగలే సంతోషంగా ఉన్నారు..
ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12వేలు ఇచ్చి తల్లి బిడ్డను ఇంటి దగ్గర దించి వచ్చేలా అనాడు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో అనేక కార్యక్రమాలు రద్దయ్యాయని వివరించారు. హైదరాబాద్ లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒక్కరు దొంగలు, మరొక్కరు దోమలు. హైదరాబాద్లో ఎక్కడబడితే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క ముఖ్యమంత్రి భూములు కబ్జాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఉప్పల్ ఫ్లై ఓవర్ భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ 8 ఏండ్లు అయింది. ఎక్కడ పని అక్కడే ఉందని ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడుకు మూడు క్లిన్ స్వీప్ చేశారని, మరోసారి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ బుల్డోజర్ వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్, జక్కా వెంకట్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.