రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేకరణను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతులను ఒప్పించి వారికి పరిహారాన్ని అందించి భూములను సేకరించింది. ప్రస్తుతం ఆ భూముల్లోనే రేవంత్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలన భవనాన్ని ఏడు ఎకరాల్లో నిర్మించింది. ఈ భవనాన్ని, 17 ఎకరాల్లో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని సీఎం బుధవారం ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాచారం, కందుకూరు మండలాల్లో సేకరించిన భూముల్లో ఫార్మాసిటీనే ఏర్పాటు చేయాలి. అందులో ఫార్మా కంపెనీలనే నెలకొల్పాలి. కానీ, ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాటమార్చారు. వారి స్వప్రయోజనాల కోసం ఫ్యూచర్‌సిటీని అడ్డు పెట్టుకుని రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీ భవనం ఎలా కడతారు.