మూసాపేట, జూన్ 11: ‘ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అసలు భూసేకరణ చేయలేదనడం హాస్యాస్పదం.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 27వేల ఎకరాల భూసేకరణ చేపట్టారు.. కానీ సీఎం హోదాలో ఉన్న రేవంత్ భూసేకరణపై నోరు పారేసుకున్నారు’.. అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. నాడు ప్రాజెక్టులకు ఎలాంటి భూ సేకరణ చేయలేదని సీఎం రేవంత్ చెప్పినదాంట్లో నిజం లేదని స్పష్టంచేశారు.
ఈనెల 11న “నమస్తే తెలంగాణ” దినపత్రికలో ప్రచురితమైన కథనం, చిత్రాలు అక్షర సత్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా, కనీసం ఎకరం భూమి కూడా కొనుగోలు చేయలేదని, గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టుకు 27వేల ఎకరాల భూసేకరణ చేసినట్టు గుర్తుచేశారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్‌ను నాడు సీఎం హోదాలో కేసీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురైన భట్టుపల్లి తండావాసులకు సంతోషంగా భూములు, ఇండ్లు ఇవ్వగా, వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించానని తెలిపారు.
నా నిజాయితీ నచ్చి తండావాసులే ఆ కాలనీకి ‘ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కాలనీ’ అని పెట్టుకున్నారని పేర్కొన్నారు. 90 శాతం మంది భూములు కొనుగోలు చేశారని, ప్రస్తుతం ఎకరం భూమి రూ.40 లక్షల వరకు పలుకుతూ వారంతా కోటీశ్వరులయ్యారని తెలిపారు. ఇలా కేసీఆర్ చేసిన మంచి పనులు కండ్లముందు కనిపిస్తున్నా.. రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్ప డం సరికాదని హితవుపలికారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమో దు, ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు.