హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నాగాలు పన్నుతున్నది. రాజకీయంగా ఎదుర్కోలేక పూటకో విచారణతో కక్షసాధింపులకు దిగుతున్నది. కేసుల పేరిట అప్రతిష్ఠపాల్జేసేందుకు బరితెగించింది. విద్యుత్ కొనుగోళ్ల విచారణ పేరిట కొంతకాలం, కాళేశ్వరంపై మరికొంత కాలం.. ప్రస్తుతం ఫోన్‌ట్యాపింగ్ అంటూ ఇలా సాగదీస్తూనే ఉన్నది. వ్యక్తితత్వాన్ని కించపరిచేలా లీకులిస్తూ కేసీఆర్‌పై బురదజల్లేందుకు యత్నిస్తూనే ఉన్నది. ఇప్పటికి పలు విచారణలు పూర్తయి నివేదికలు వచ్చినా, కోర్టుల్లో పలు సందర్భాల్లో మొట్టికాయలు పడినా కాంగ్రెస్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు.
రేవంత్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్‌పై బురదజల్లేందుకు యత్నిస్తూనే ఉన్నారు. రాజకీయ ప్రేరేపిత కమిషన్లను ఏర్పాటుచేసి కక్షగడుతున్నది. అందులో భాగంగా తొలుత ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్‌ప్లాంట్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణ సంఘాన్ని 2024 మార్చి14న నియమించింది. ఈఆర్సీ ఆమోదించిన అంశాలపై విచారణ సంఘాన్ని నియమించడం చట్టవిరుద్ధమని, విచారణ సమయంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించడం, పక్షపాతంగా వ్యవహరిస్తూ విచారణ పూర్తికాక ముందే స్వయంగా తీర్పులు వెల్లడిస్తున్నారనే అంశాలను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తుదకు కోర్టు మొట్టికాయలు వేయడంతో జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సంఘం బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వెరసి ప్రభుత్వం ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను విచారణ సంఘానికి నియమించించగా ఆయన విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ తర్వాత క్యాబినెట్లో పెడుతామని చెప్పిన సర్కార్, నివేదికను అటకెక్కించింది. కానీ రూ.కోట్లలో అవినీతి అంటూ అడ్డగోలు ప్రచారానికి ప్రభుత్వం పూనుకున్నది. కేసీఆర్‌పై నిందలు మోపేందుకు యత్నించింది.
ఇక మేడిగడ్డ బరాజ్‌లో చిన్నపాటి ఘటనను సాకుగా చూపుతూ మరో కుట్రకు తెరతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో లోపాలంటూ గగ్గోలు పెట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చి 13న విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 100రోజుల్లో అంటే జూన్ చివరి నాటికి రిపోర్టు ఇచ్చేలా కమిషన్‌కు గడువు ఇచ్చింది. కానీ కమిషన్ విచారణ గడువును ఏడు సార్లు పొడిగించింది. మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి 16నెలల పాటు సాగదీసింది. ఇంజినీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ఏజెన్సీలను విడతలవారీగా విచారిస్తూ, ప్రభుత్వం రోజుకో లీకును ఇస్తూ కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించింది. చివరకు 2025 జూలై 31న కమిషన్ తన నివేదికను సమర్పించింది. కాంగ్రెస్ ఆరోపణలకు అనుగుణంగా సదరు కమిషన్ సైతం 655పేజీల నివేదికను వండివార్చింది. క్యాబినెట్లో, ఆపై అసెంబ్లీలో పెట్టి రాద్ధాంతం చేసింది. కమిషన్ వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తూ బీఆర్ఎస్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. వెరసి ఇక్కడా ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పలేదు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక సైతం అటకెక్కింది.
ఇక ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని సైతం రెండేండ్లుగా సాగదీస్తున్నది. ఇంటెలిజెన్స్‌లో ప్రతి ఆరు నెలలకు ఒకసారీ అధికారికంగా జరిగే ఆధారాల ధ్వంసంపై అనుమానాలు ఉన్నట్టు ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ మార్చి 10, 2024న పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత నాటి డీసీపీ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ప్రభుత్వం హడావుడిగా సిట్ ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించి నిందితులుగా పేర్కొంటూ పలువురిని అరెస్ట్ చేసింది. ఇలా 2025 డిసెంబర్ వరకు సుమారు 300మందిని విచారించి, పలువురి నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికీ ఈ కేసులో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఫోన్‌ట్యాపింగ్ అంశాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉండి కూడా పిచ్చి ప్రేలాపనలు చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఆఖరికి టీపీసీసీ చీఫ్ కూడా విచక్షణ మరచి మాట్లాడారు. కానీ తుదకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఇక్కడా సర్కార్‌కు అక్షింతలు తప్పలేదు. సుప్రీంకోర్టు సహా తమకు వ్యతిరేక పవనాలు వీస్తుండటడంతో డిసెంబర్ 18, 2025న రాత్రికి రాత్రే డీజీపీ శివధర్‌రెడ్డి పర్యవేక్షణలో సజ్జనార్ నేతృత్వంలో మరో 10మందితో కూడిన అధికారికంగా స్పెషల్ సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏర్పడిన రోజు నుంచే.. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తులకు నోటీసులిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ విధంగానే నోటీసులిచ్చారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనని స్పష్టంగా తెలిసిపోతున్నది.
కమిషన్లు మాత్రమే కాదు రాజ్యాంగ సంస్థలనూ కాంగ్రెస్ ఇష్టారీతిన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నది. పూటకో డ్రామాకు తెరతీస్తున్నది. కేసీఆర్‌పై కక్షసాధింపులకు దిగుతూనే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ పేరిట లీకులిస్తూ బురదజల్లే యత్నం చేసింది. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికను అడ్డుపెట్టుకుని, ఆపై ఆ నివేదికను సైతం అధ్యయనం చేసేందుకు కమిటీల మీద కమిటీలు వేస్తూ మసిపూసి యత్నం చేసింది. గడిచిన 24నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ ఆయా విచారణలను, కేసులను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీస్తూనే ఉన్నారు. 420 హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ ఏ ఒక్కటీ అమలు చేయలేక ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. మరోవైపు బొగ్గుగనుల కుంభకోణంలో, కాంట్రాక్టు పనుల వాటాల పంచాయతీల్లో, బిల్లుల కమిషన్లు, ఇసుక, భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా అవినీతి మరకలు అంటించుకుని అప్రతిష్ఠపాలైంది. అమాత్యుల పంచాయతీ రచ్చకెక్కడం.. ఆ అంశాలపై ప్రజల్లో విపరీతమైన చర్చ జరగడం, వాటి నుంచి ప్రజలల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ సర్కార్ పాల్పడటం పరిపాటిగా మారింది. అవినీతిపై సర్కార్‌ను నిలదీస్తున్న, ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు కక్షసాధింపులకు దిగుతున్నది.