హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒప్పుకొనేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసిందని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టు జలసౌధ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఏపీకి చెందిన కేంద్రజల్‌శక్తి ఉన్నతాధికారి ఢిల్లీలోనే మకాం వేసి ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా చక్కబెడుతున్నట్టు వెల్లడించాయి. ఆ ప్రతిపాదనల్లో ఏమున్నదో కనీసం ఇంటర్‌స్టేట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
పాలమూరుకు బదులుగా బనకచర్ల
ఏపీ ప్రభుత్వం రూ.81 వేల కోట్లతో పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పోలవరం కుడి కాలువ, తాడిపూడి కాలువల సామర్థ్యాన్ని పెంచి 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా, ప్రకాశం బరాజ్‌కు, ఆపై బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి పల్నాడు ప్రాంతానికి తాగు, సాగునీరు, ఆ తర్వాత బనకచర్ల క్రాస్ హెడ్‌రెగ్యులేటర్ వరకు తరలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కో బేసిన్ రాష్ర్టాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. అయినా ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
సంప్రదింపులు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ర్టాల ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను వదులుకొని, తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకరించాలని, దీనికి బదులుగా బనచర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణను ఒప్పిస్తామని చెప్పింది. కేంద్ర జలసంఘం ఇటీవలే ఈ ప్రతిపాదనలపై ఏపీ, తెలంగాణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిని నిర్దంద్వంగా తిరస్కరించి, తెలంగాణ జలహక్కులను కాపాడాల్సిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం కేంద్రం చేసిన ప్రతిపాదనలకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఏపీతో ఒప్పందం చేసుకొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు జలసౌధవర్గాలు తెలిపాయి.
అంతా ఆదిత్యానాథ్‌దాస్ చేతుల్లోనే..
కేంద్రం చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ఉమ్మడి పాలమూరు జలహక్కులకు గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కేంద్రం ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని కూడా బయటికి వెల్లడించడం లేదు. ఏ చిన్న సమాచారాన్ని కూడా బయటకు పొక్కనీయడం లేదు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్ ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తున్నారని తెలుస్తున్నది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించిన సందర్భంలోనే రాష్ట్ర ఇంజినీర్లు, తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీలో కీలక పదవుల్లో పనిచేసి, తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన వ్యక్తిని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారుగా నియమించడం ఏమిటని ప్రశ్నించారు. అనేక అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే తాజా పరిణామాలు జరుగుతున్నాయి. కీలకమైన ఇంటర్‌స్టేట్ వాటర్ విభాగం అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా ఆదిత్యనాథ్‌దాస్ ఒక్కరే వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపు నెలరోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారని, ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం.
జలవివాదాల పరిష్కారం కోసమంటూ కేంద్ర జల్‌శక్తిశాఖ సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అందులోనూ ఆదిత్యనాథ్‌దాస్ ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కమిటీ సమావేశాల్లో కేంద్రంలో కీలకస్థానంలో ఉన్న ఏపీకి చెందిన ఉన్నతాధికారితో కలిసి ఆదిత్యానాథ్‌దాస్ ఒక్కరే పాల్గొన్నారు. అసలు ఆ ప్రతిపాదనల్లో ఏముంది? అనేది ఎవరికీ తెలియకుండానే మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. పేరుకు మాత్రమే రాష్ట్ర ఇంజినీర్లను ఢిల్లీకి తీసుకెళ్తున్నా, అక్కడ జరిగిన చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారని తెలుస్తున్నది. సాయంత్రం సమావేశం ఉంటే ఉదయం పూట సమాచారమిస్తున్నారని, ఇంటర్‌స్టేట్ అధికారులను కనీసం లోపలికి కూడా రానివ్వలేదని జలసౌధ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ ఇచ్చిన పీపీటీ కాపీలను సైతం ఇప్పటివరకు రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అధికారులకు ఇవ్వలేదంటే ఏ స్థాయిలో గుట్టుగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఏపీతో ఒప్పందం ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని పేర్కొన్నారు.
నోరువిప్పని ప్రభుత్వ పెద్దలు
బనకచర్లకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై ఇంజినీర్లు, తెలంగాణవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది తెలంగాణ జలహక్కులకు తీరని విఘాతమని హెచ్చరిస్తున్నారు. అయినా ఇప్పటికీ కేంద్రం ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలెవరూ నోరువిప్పకపోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం దీనిపై స్పందించలేదు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒప్పందానికి సిద్ధమైన నేపథ్యంలోనే మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నపళంగా పాలమూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. కేంద్రం ప్రతిపాదనలకు ప్రభుత్వం తలొగ్గుతున్నదని ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, దాని నుంచి దృష్టిని మళ్లించడం కోసమే పాలమూరు పర్యటనకు వెళ్తున్నారని రాజకీయవర్గాలు, తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదనలు చేసిన అంశం బయటకు పొక్కిన వెంటనే రెండేండ్లుగా పెండింగ్ పెట్టిన పరిహారం అంశంపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలని, కేంద్రం ప్రతిపాదనలను బహిరంగపరిచి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో కీలక నిపుణుడికీ షాక్
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ పార్టీ వైరుధ్యాన్ని పక్కకు పెట్టి గతంలో కేంద్రంలో కీలకంగా పనిచేసిన జలరంగ నిపుణుడిని సంప్రదిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఇంజినీర్లను సైతం కాదని గోదావరి ప్రాజెక్టులు, అంశాలకు సంబంధించి సదరు నిపుణుడితోనే స్వయంగా చ ర్చలు జరిపిన సందర్భాలు అనేకం ఉన్నా యి. ప్రత్యేకంగా అధికారిక సమావేశాల్లో నూ భాగస్వామిని చేసి సలహాలు, సూచనలను సైతం స్వీకరించారు. కానీ ప్రస్తుతం బనకచర్లపై కేంద్రం చేసిన ప్రతిపాదనలకు సంబంధించిన చర్చల్లో సదరు నిపుణుడిని సంప్రదించిన దాఖలాలు లేవని తెలిసింది. సదరు నిపుణుడిని ప్రభుత్వమే పక్కన పెట్టిందని ఒక వర్గం చెప్తుండగా, కాంగ్రెస్ తలపెడుతున్న చారిత్రక ద్రోహాన్ని సమర్థించలేక ఆయనే దూరంగా ఉంటున్నారని మరోవర్గం ఇంజినీర్లు చెప్తున్నారు.