సంక్షేమ పథకాలు, ఆస్తుల కల్పన, వ్యవసాయరంగ పురోగతి కోసం కేసీఆర్ ప్రభు త్వం రుణం తెస్తే.. అప్పులపై ఇప్పటికీ రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాన్ని అప్పులపై నిందిస్తూనే ఉన్నారు. అదే సమయంలో రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఏ సంపద సృష్టించిందో, ఏ సంక్షేమానికి సంపూర్ణంగా ఖర్చు చేసిందో అంతుపట్టని విషయంగా మారింది. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10వేల కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం.. అదంతా రైతుల కోసమేనని నమ్మబలికింది. ఆ మేరకు రైతుభరోసా, ఆత్మీయ భరోసా కోసం రుణం తెచ్చామని.. చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. మరోవైపు రైతుభరోసా, ఆత్మీయ భరోసా పంపిణీ సగంలోనే ఆగిపోయింది. అది పూర్తికావాలంటే డబ్బులు కావాలన్నట్టుగా సర్కారు ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్నది. రైతు పథకాలను చూపి మరీ తెచ్చిన అప్పులో రూ.5 వేల కోట్లు ఏమైనయ్? ఎటు దారిమళ్లినయ్?
Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రూపాయి అప్పు చేసినా సరే పైసా పైసా చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని పెద్దలు చెప్తుంటారు. అలాంటిది అత్యంత విలువైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కుదవ పెట్టి మరీ రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఆ పైసలను ఏం చేసింది? ఎవరికి ధారపోసింది? అనేది అత్యంత రహస్యంగా మారింది. అప్పు తెచ్చిన సొమ్ములో సగం పక్కదారి పట్టింది. అప్పు తెచ్చిన పైసలతో రైతులకు రైతుభరోసా, కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తామంటూ సర్కారు పెద్దలు లీకులిచ్చారు. కానీ, ఇప్పటివరకు రైతుభరోసా కింద రూ.5 వేల కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. దీంతో మిగిలిన రూ.5 వేల కోట్ల సొమ్ము ఎవరి జేబుల్లోకి పో యింది? ఏమైపోయింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భూములను తా కట్టు పెట్టి అప్పలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అప్పు ఎందుకు తెచ్చింది? ఎవరి కోసం తెచ్చింది? ఏ లక్ష్యం కోసం తెచ్చింది? ఆ లక్ష్యం నెరవేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు, తీసుకుంటున్న ప్రతి చర్య అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. తాకట్టు పెట్టిన భూములను నాలుగు నెలలు తిరగకముందే అమ్మేయాలనుకోవడం, చిరకాల ప్రత్యర్థిపై యుద్ధం ప్రకటించినట్టుగా బుల్డోజర్లను హెచ్‌సీయూ భూములపైకి దండయాత్ర మాదిరిగా పంపడం, ఎకరం రూ.100 కోట్ల విలువైన భూములను రూ.52 కోట్లకే అమ్మేయాలనుకోవడం.. ఇలా ప్రతి అడుగూ అనుమానాస్పదమే.
రైతుల మాటున భూములను తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మును నొక్కేసేందుకు సర్కారు పెద్దలు స్కెచ్ వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టడం ద్వారా సమకూరే రూ.10 వేల కోట్లలో సగం సొమ్మును కొట్టేసేందుకు సర్కారులోని ఓ నలుగురు పెద్దలు స్కెచ్ వేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులోభాగంగానే తాకట్టు సొమ్ము నుంచి కాంట్రాక్టుల బిల్లులు చెల్లించేలా ఒప్పందాలు కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇది నేరుగా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో, దీనికి పథకాల ముసుగు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కంచ గచ్చిబౌలిలోని భూములను తాకట్టు పెట్టడం ద్వారా సమకూరే రూ.10 వేల కోట్లతో రైతులకు రైతుభరోసా, కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తామంటూ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. కానీ, అప్పు తెచ్చిన సొమ్ము పక్కదారి పట్టింది. రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ కాలేదు. రైతులకు రూ.5 వేల కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 28న భూముల తాకట్టు సొమ్ము రూ.10 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమైనట్టు సమాచారం. అంటే తాకట్టు నిధులు ప్రభుత్వానికి చేరి ఇప్పటికే మూడు నెలలు గడిచాయి. కానీ, ఇంకా సగం మంది రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందలేదు. రైతుభరోసా కోసం మొత్తం రూ.9 వేల కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విధంగా అప్పు తెచ్చిన సొమ్ములో ఇంకా రూ.5 వేల కోట్ల వరకు మిగిలిపోయాయి. అయినప్పటికీ, సర్కారు పెద్దలు ఇచ్చిన లీకుల ప్రకారం రైతులందరికీ రైతుభరోసా ఎందుకు ఇవ్వలేదు? కూలీలకు ఆత్మీయ భరోసా ఎందుకు జమ చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానంగా మారింది. గతంలో కేసీఆర్ సర్కారు.. ప్రతిరోజూ ఎంతమంది రైతులకు, ఎంత మొత్తం పంపిణీ చేసిందో వివరాలతో ప్రకటన ఇచ్చేది. కానీ, కాంగ్రెస్ సర్కారు గోప్యత పాటిస్తున్నది. ఏ రోజు ఎంత మందికి ఇచ్చారో వెల్లడించడం లేదు. కనీసం ఇప్పటివరకు ఎంత మందికి, ఎంత సొమ్ము జమ చేశారనే వివరాలు కూడా తెలపడం లేదు. రైతులకు చెల్లించే సొమ్ము విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడెకరాల వరకు వివరాలను వెల్లడించిన సర్కారు ఆ తర్వాత గోప్యత పాటిస్తున్నది. వివరాలు వెల్లడిస్తే అసలు నిజాలు ప్రజలకు తెలిసిపోతాయని, అప్పు తెచ్చి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఎదురవుతాయనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది.
కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు సొమ్ములో మిగిలిన రూ.5 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి కాకుండా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. బడా కాంట్రాక్టర్ అయిన ఒక మంత్రి, ఇటీవల మంత్రివర్గంలో చోటు దక్కుతున్నదంటూ ప్రచారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అదే జిల్లాకు చెందిన ఒక ఎంపీకి చెందిన సంస్థలు, బంధువుల సంస్థల కాంట్రాక్టు బిల్లులకు ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసం ఈ ముగ్గురు నేతలు ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేతతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలిసింది. దీంతో తాకట్టు సొమ్మును కాంట్రాక్టర్లకు ముట్టజెప్పేందుకు లైన్‌క్లియర్ అయిందని, తద్వారా ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు పెద్ద ఎత్తున కమీషన్లు ముట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రైతులు, కూలీల పేరు చెప్పి ప్రభుత్వ పెద్దలు తాకట్టు పెట్టిన సొమ్మును తమ వారికి పప్పు బెల్లంలా పంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పు చేసి పంచి పెట్టడమంటే ఇదేనేమో! రూ.వందల కోట్ల ప్రజాధానాన్ని కాంగ్రెస్ సర్కారు బ్రోకర్లకు ధారపోస్తున్నది. కంచ గచ్చిబౌలి భూములను ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం ఇప్పేంచేందుకు ఒక ప్రైవేటు సంస్థ మధ్యవర్తిత్వం వహించింది. ఇందుకోసం సదరు సంస్థకు కాంగ్రెస్ సర్కారు దాదాపు రూ.170 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించింది. ఇంత భారీ మొత్తంలో ప్రజాధానాన్ని బ్రోకర్లకు సమర్పించడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ముఖ్య నేతలకు ఎంత ముట్టిందో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు అమ్ముతున్నారంటూ, అప్పులు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నాడు కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తున్నది. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టడాన్ని ఆయన ఏ విధంగా సమర్థించుకుంటారని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు తాకట్టు పెట్టిన భూమిని, జీవవైవిధ్యం కలిగిన అడవిని ఏకంగా అమ్మేయాలనే నిర్ణయంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు సుద్దులు చెప్పి.. నేడు చేస్తున్నదేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాడు కేసీఆర్ చేసింది తప్పు అయితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి చేసేది ఒప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన పలు టెండర్లపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న సంస్థల్లో ఒకటైన బీహెచ్ఈఎల్కు ఇచ్చిన టెండర్లపై సైతం ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. నాడు కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలను బతికించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనుల కాంట్రాక్టును బీహెచ్ఈల్కు అప్పగించారు. దీనిపై నాడు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి విచారణకు ఆదేశించారు. కానీ, ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూములను ఏకంగా ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ వద్ద తాకట్టు పెట్టారు. ప్రైవేటు ఏజెన్సీలను నియమించి వాల్యూయేషన్లు, అమ్మకాలకు సలహాలు తీసుకున్నారు. నాడు ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చిన టెండర్లపైనే విచారణ చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు ప్రైవేటు బ్యాంకులతో లావాదేవీలపై ఎలాంటి విచారణ జరిపిస్తారని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ చేసింది తప్పే అయితే, నేడు రేవంత్‌రెడ్డి చేస్తున్నది అంతకన్నా పెద్ద తప్పు అని తేల్చి చెప్తున్నారు.
ఐటీ కారిడార్‌కు ఆమడదూరంలో ఉన్న కోకాపేటలో బీఆర్ఎస్ హయాంలో ఎకరం భూమి ధర రూ.100 కోట్లు పలికింది. అలాంటప్పుడు ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న కంచ గచ్చిబౌలి భూమి ధర కూడా అంతకు మించి ఉండాలి. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం ధరను అమాంతం తగ్గించేసింది. నిరుడు జూన్ లో జారీ చేసిన ఉత్తర్వుల్లో కంచ గచ్చిబౌలిలో ఎకరం విలువ రూ. 75 కోట్లుగా నిర్ణయించింది. అంటే వాస్తవ ధర కన్నా రూ.25 కోట్లకు ఇక్కడే కోత పెట్టింది. ఆ తర్వాత నిరుడు నవంబర్‌లో ప్రభు త్వం పరీశ్రావు పన్సే-రావు అసోసియేట్స్ సంస్థతో ఆ భూమిని వాల్యూయేషన్ చేయించింది. సదరు సంస్థ ఈ విలువను మరింత తగ్గించి ఎకరం రూ.52 కోట్లుగా తేల్చింది. అంటే, కేవలం ఐదు నెలల్లోనే ప్రభుత్వ నిర్ణయించిన ధర కన్నా రూ.23 కోట్లు కోత పెట్టింది. ఈ లెక్కన బీఆర్ఎస్ సర్కారు నాటి ధరతో పోల్చితే రూ.48 కోట్లు తగ్గించడం అనుమానాలకు తావిస్తున్నది. భూమి విలువను తగ్గించడం ద్వారా ముఖ్య నేతలు భారీ భూ కుంభకోణానికి తెరతీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్లో ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టింది. రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నది. మూడు నెలల క్రితమే తాకట్టు పెట్టిన సదరు భూమిని ఇప్పుడు ఏకంగా అమ్మేయాలని నిర్ణయించింది. అలాంటప్పుడు ఎందుకు తాకట్టు పెట్టినట్టు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక భారీ కుట్ర ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిని పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు విక్రయించాలని భావించినట్టు తెలిసింది. ఆయా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రభుత్వంలోని ఓ ముగ్గురు కీలక వ్యక్తులకు వాటాలు ఉండటమే ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే సదరు కంపెనీలతో మాటామంతి పూర్తి చేసుకొని ఆ భూమిని అగ్గువ ధరకు కట్టుబెట్టేందుకు నిర్ణయించుకున్నారనే ఆరోపణలున్నాయి.
కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐని ఎంచుకున్నది. ఎస్బీఐ వంటి ప్రభుత్వ బ్యాంకులను పక్కనపెట్టి రిస్క్‌తో కూడిన ప్రైవేటు బ్యాంకులో రూ.వేల కోట్ల విలువైన భూమిని తాకట్టు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కమీషన్ల కహాని ఉన్నట్టు అనుమానాలున్నాయి. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు బ్యాంకుల్లో ఆయా ఉద్యోగులు సాధించిన లావాదేవీలను బట్టి ఇన్సెంటివ్స్, ప్రమోషన్లు ఉంటాయి. దీంతోపాటు అధిక మొత్తంలో బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చేసేవారికి, డిపాజిట్లు చేసే వారికి సదరు బ్యాంకులు పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తాయనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రిస్క్‌లేని ప్రభుత్వ బ్యాంకులను కాదని, రిస్క్‌తో కూడిన ప్రైవేటు బ్యాంకులో 400 ఎకరాలు కుదవపెట్టి రుణం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.