హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ జర్నలిస్టునూ రేవంత్ సర్కారు వదలడం లేదు. ఎక్కడికక్కడే కేసులు నమోదు చేసి, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అరెస్టు చేయిస్తున్నది. ఏకంగా బెడ్రూంలోకి దూరి మరీ.. కట్టుబట్టలతో తీసుకొచ్చి ఠాణాల్లో బందిస్తున్నది. నాడు న్యూస్‌లైన్ శంకర్.. మొన్న సరిత, విజయారెడ్డి, శివారెడ్డి.. నిన్న రేవతి, తన్వీయాదవ్.. నేడు మళ్లీ అదే న్యూస్‌లైన్ శంకర్ ఇలా చెప్పుకొంటూ పోతే పదుల సంఖ్యలో జర్నలిస్టులపై సర్కారు కేసులు బనాయించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే వీరు చేసిన పాపమైంది. అందుకే నేటికీ అక్రమ కేసుల కారణంగా న్యూస్‌లైన్ శంకర్ చంచల్‌గూడ జైలులోనే మగ్గుతున్నాడు. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులతోపాటు ప్రభుత్వానికి కొరగాని కొయ్యలా మారిన ఉద్యమ పత్రిక నమస్తే తెలంగాణ విలేకరులపైనా ఎక్కడికక్కడ కేసులు నమోదవుతున్నాయి.
తొలినుంచీ ‘నమస్తే తెలంగాణ’పై కన్ను
పోలీసుల అక్రమాలను బయటపెట్టినందుకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల ‘నమస్తే తెలంగాణ’ విలేకరి కొండా సతీశ్‌పై అక్రమ కేసులు నమోదు చేసి, మానుకోటలోని సబ్ జైలుకు తరలించారు. నిజాన్ని నిర్భయంగా పత్రికల్లో రాసే రిపోర్టర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం పరిపాటిగా మారింది. పెద్దవంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో పోలీసులు కలిసి మందు పార్టీ చేసుకున్నారని సతీశ్ వెలుగులోకి తేగా డీజీపీ స్పం దించి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. దీంతో కక్షసాధింపు చర్యగా సతీశ్ పైనే ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపారు. వేములవాడలో కోడెల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నమస్తే తెలంగాణ విలేకరి స్నేహితుడి హాస్పిటల్‌ను సీజ్ చేశారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ వీ సత్యనారాయణ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువకావడం లేదంటూ వరస కథనాలు రాస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకొని నంనూర్ పంచాయతీ కార్యదర్శితో బెదిరింపుల కేసు పెట్టించారు. బీఎన్ఎస్ 132, 292, 351(2),ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటికి తోడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మెరుగైన సమాచారాన్ని చేరవేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేకించి ప్రతిరోజూ రిజాయిండర్ రావడం పరిపాటిగా మారింది.
కరెంటు లేదని ప్రశ్నించినందుకు..
రేవతి అనే స్వతంత్ర జర్నలిస్టు నిరుడు జూన్ 18న తరచూ విద్యుత్తు అంతరాయాలు ఎదుర్కొంటున్నట్టు ఎక్స్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమె ఉంటున్న ఏరియాకు వచ్చిన లైన్‌మన్.. ఆమెను ఆ పోస్టు తీసేయాలని బెదిరించాడు. ఈ ఘటనతో ప్రభుత్వం మరింత సీరియస్ అయింది. ఎక్స్‌లో పోస్టు పెట్టిన రేవతిపైనే 2024, జూన్ 19న క్రైమ్ నంబర్ 662/2024 కింద ఐపీసీ సెక్షన్ 505 (ప్రజా దుష్ప్రవర్తన) ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (డి) (వ్యక్తిగతంగా మోసం చేయడం) వంటి వాటిపై కేసు నమోదు చేయించింది. ఇటీవల ఓ రైతు తన భూమిని ప్రభుత్వం అన్యాయంగా లాక్కోవడంపై యూట్యూబ్ వేదికగా తన బాధను వెల్లగక్కాడు. దీంతో ఆ వీడియో పోస్టు చేసిన జర్నలిస్టు రేవతి, తన్వీ యాదవ్‌లపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారు.
ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై స్వతంత్ర జర్నలిస్టులు సరితా యాదవ్, విజయారెడ్డి రైతులతో మాట్లాడుతుండగా కొందరు కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేసి, ఫోన్లు, కెమెరాలు లాకుని దాడికి పాల్పడ్డారు. వారు రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే కార్లలో మారణాయుధాలతో వెంబడించి, దాడికి ప్రయత్నించారు. సాక్షాత్తూ పోలీసులే చేష్టలుడిగి చూస్తుండగా పోలీస్ స్టేషన్ బయట కార్లలో కాపుకాసి హత్యకు ప్రయత్నించారు. సాక్షాత్తూ సీఎం స్వగ్రామంలోనే పట్టపగలే ఇదంతా జరిగింది. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు.
శంకర్, శివారెడ్డి, చిలుక ప్రవీణ్ బాధితులే
ప్రజలపక్షాన నిలబడినందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమకేసులు ఎదుర్కొంటున్న వారిలో న్యూస్‌లైన్ శంకర్, సిగ్నల్ టీవీ శివారెడ్డి, చిలుక ప్రవీణ్, గౌతమ్, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్, రంజిత్‌రెడ్డి వంటివారు ముందు వరసలో ఉన్నా రు. వీరిపై ఇప్పటికే కొన్నిసార్లు హత్యాయత్నం కూడా జరిగిం ది. అయినా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఎంతోమంది జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే న్యూస్‌లైన్ శంకర్‌పై ఇప్పటి వరకు 18 అక్రమ కేసులను ప్రభుత్వం పెట్టించింది. నిరుడు ఆఫీస్ ముందే శంకర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొండారెడ్డి పల్లి వెళితే మరోసారి హత్యాప్రయత్నం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు, న్యూస్‌లైన్ ద్వారా లైవ్‌లో వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నందుకు, ‘తెలంగాణం’ పత్రికలో నిజాలు చెప్తున్నందుకు కుట్రలు పన్నిన కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టారు. మరో జర్నలిస్టు చిలుక ప్రవీణ్‌పైనా ఇప్పటికే రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది.
హెచ్‌సీయూ అంశాన్ని కవర్ చేసినందుకు..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిసూ విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఆ వార్తలను ‘సౌత్‌ఫస్ట్’ జర్నలిస్టు సుమిత్ కవర్ చేసేందుకు వెళ్లాడు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడవిని నరికివేయొద్దని, 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆ వార్తలను కవర్ చేస్తున్న సుమిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను జర్నలిస్టునని చెప్పినా వినకుండా అదుపులోకి తీసుకున్నారు. దీంతో జాతీయస్థాయి లో రేవంత్‌రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘తెలంగాణలో పోలీసుల అతిక్రమణ ఆందోళనకరంగా ఉన్నది.
జర్నలిస్టులను అదుపులోకి తీసుకుంటున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న గొంతులను అరెస్టులతో మూసేస్తున్నారు. స్వేచ్ఛ, వాక్ స్వా తంత్య్రం, భావవ్యక్తీకరణను బహిరంగంగా అణచివేయడం ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్యం, వాక్ స్వా తంత్య్రం విషయంలో మీ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు చాలా బాధాకరంగా ఉన్నా యి రాహుల్ గాంధీ’ అని ఎక్స్ వేదికగా పోస్టులు వెల్లువెత్తాయి.ఒకరిద్దరు జర్నలిస్టులను కాదు.. పదుల సంఖ్యలో జర్నలిస్టులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నది. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే ఇండిపెండెంట్ జర్నలిస్టులపై రేవంత్‌రెడ్డి అకసు వెళ్లగకుతున్నారు.
-బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్