హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినపుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి.. అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేస్తుంది. ‘అంతా మా ఇష్టం.. కోర్టు స్టేలను సైతం ధిక్కరిస్తాం..’ అన్నట్టు ఇష్టానుసారంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నది. యథా రాజా… తథా ప్రజా అన్నట్టు రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా, ఇతర శాఖలు సైతం ఒకవైపు నిర్మాణాలపై బుల్డోజర్లతో దాడిచేయడంతో పాటు న్యాయస్థానాల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రాథమిక హక్కులను సైతం ప్రభుత్వం కాలరాయటం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పరిగణనలోనికి తీసుకోకుండా ముందుకు పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సామాన్యుడు కోర్టు తలుపులు తట్టడమే నేరంగా.. ఆ దారులు మూసివేస్తాం! అన్నట్టు హైడ్రా, ప్రభుత్వ వైఖరి ఉండటం విపరీత పరిణామాలకు దారి తీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
నాడు ఒక నీతి… ఇప్పుడు మరో రీతి
‘సోమేశ్‌కుమార్ అంత పొడుగు.. ఇంత పొడుగు అంటడు. పొయ్యి అయ్యప్ప సొసైటీలో ఉన్నపళంగా రూపాయి.. రూపాయి.. జమ చేసుకొని ఉద్యోగస్థులు 200 గజాలు, 400 గజాల్లో ఇండ్లు కట్టుకుంటే జేసీబీలు, పెద్దపెద్ద మిషన్లు తీస్కపోయి నేలమట్టం చేసిండు. చట్టంలో అక్రమాలు జరిగినా క్రమబద్ధీకరించే (రెగ్యులర్) నిబంధన ఉన్నది. వాళ్లేం దోపిడీ చేయలే.. వాళ్లేం దేశద్రోహం చేయలే.. వాళ్లు అమాయకంగా కొనుక్కున్నరు. దాంట్లో కట్టుకున్నరు. అనుమతులు లేకపోతే రెగ్యులరైజ్ చేయటానికి నిబంధన ఉన్నది. నేలమట్టం చేయాల్సిన అవసరం ఉన్నదా సార్? ఇయాల ప్రభుత్వ భూముల్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేదుండె! కటాఫ్ డేట్ ఇచ్చేదుండె’
నాటి బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలివి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతూ క్రమబద్ధీకరణ చేయొచ్చు కదా! అని ఉచిత సలహా ఇచ్చారు. ఎండీ రాధాకృష్ణ సైతం అందుకు వంత పాడారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు, ఉచిత సలహాలను రేవంత్ విస్మరించటం గమనార్హం. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడకుండా క్రమబద్ధీకరణ విధానాన్ని అవలంబించవచ్చు కదా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కూడబలుక్కున్నా నిజం దాగుతుందా?
రేవంత్ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. పైగా బాకాపత్రికతో అదే గాంభీర్యాన్ని ప్రచారం చేసుకుంటున్నది. గత నెల 18న గండిపేటలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఖానాపూర్ గ్రామపరిధిలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గెస్ట్‌హౌస్, దానికి కొంతదూరంలో ఆయన సోదరుడికి చెందిన ఓరో స్పోర్ట్స్విలేజ్ ఉన్నది. హైడ్రా అధికారులు కేవలం ఓరో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణాల్ని కూల్చివేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సైతం తన ట్వీట్లో కూడా తన సోదరుడి నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రకటించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు మంత్రులు మాత్రం పల్లంరాజు గెస్ట్‌హౌస్‌ను కూల్చేసినట్టుగా చెప్తున్నారు. హైడ్రా అక్కడికి వెళ్లిన సమయంలో పల్లం రాజు ఢిల్లీ నుంచి ఫోన్ చేయించి తన నిర్మాణాన్ని కూల్చివేయకుండా ఆపించినట్టు ప్రచా రం జరిగింది. అయినా పల్లం నిర్మాణాన్ని కూల్చివేసినట్టు రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరం. ఇప్పటికీ ఆయన నిర్మాణం నిక్షేపంగా అక్కడే ఉన్నది. రేవంత్ బాకాపత్రిక ఆంధ్రజ్యోతిలోనూ పదేపదే పల్లం రాజు నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ ఫొటోలు చూస్తే వాస్తవమేదో అర్థమవుతుంది.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నంబర్లలో 37.08 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెన్నరీస్కు చెందినదని, దాని పూర్తి హక్కులు తమ వంశపారపర్యంగా వస్తున్నాయంటూ కొన్ని కుటుంబాలు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నది. హైకోర్టు స్టే కూడా కొనసాగుతుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా గత నెల 26న తెల్లారుజామున ఉదయం 5 గంటలకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్క్యాబ్, టీఎస్ఐఐసీ అధికారులు సుమారు వంద మంది పోలీసు బలగాల మోహరింపుతో మూడు కుటుంబాలను నిర్బంధించి బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేశారు. దీంతో ఆ కుటుంబాలు కట్టుబట్టలతో వీధినపడ్డాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 462లో ఇటీవల రెవెన్యూశాఖ కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది. వాస్తవానికి ఈ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఉన్నది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, స్టే ఉత్తర్వులను యజమానులు అధికార యంత్రాంగానికి కూడా సమర్పించారు. ఇవేమీ పట్టించుకోకుండా, నోటీసులూ ఇవ్వకుండా అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేశారు.
గత నెల 18న హైడ్రా గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలంటూ కొన్నింటిని కూల్చివేసింది. ఈ సందర్భంగా ఒక యజమాని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను సంప్రదించారు. హైకోర్టు స్టే ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా సార్! అన్నారు. ‘ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు పోతారు కదా!’ అని కమిషనర్ సెలవిచ్చారట.
హైడ్రాది రాజకీయ లక్ష్యం!
హైదరాబాద్ పరిధిలో చెరువులు కాలగర్భంలో కలిశాయంటే అది సమైక్య పాలకుల పుణ్యమే. మూసీనదిని మురికికూపంగా మార్చిన ఘనత వారిదే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని వెలగబెట్టిన పార్టీలు రెండే రెండు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పాలిస్తే, మిగిలిన కాలం తెలుగుదేశం పార్టీదే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మాణాలన్నీ గత పదేండ్లలోనే వెలిసినట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. రాజకీయ కోణంలోనే హైడ్రాను ఏర్పాటు చేశారన్న విమర్శలకు కొన్ని ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక విధానమంటూ లేకపోవడం హైడ్రా లక్ష్యంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఒక ప్రాంతం, చెరువు, జలాశయాలు.. ఏదో ఒకటి ప్రామాణికంగా అక్రమ నిర్మాణాల్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు చేపట్టాలి. కానీ విధానమంటూ లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడం, వివిధ శాఖలు కక్షపూరితంగా నోటీసులు జారీచేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది.
కాంగ్రెస్ నేతల దరిచేరని కూల్చివేతలు
పారదర్శకంగా, రాజకీయ కక్షలకు తావులేకుండా కూల్చివేతలు చేపడుతున్నామని ఇటు హైడ్రా.. అటు రేవంత్ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నది. కానీ.. హైడ్రాతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు జారీచేస్తున్న నోటీసుల్లో ఏ ఒక్క కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణాలు లేకపోవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జంట జలాశయాల పరిధిలో కాంగ్రెస్ మంత్రులు, నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా బయటపడ్డా హైడ్రా, ఇతర సంబంధిత శాఖలు అటువైపు అడుగులు వేయకపోవటాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.