హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తన బాల్యమిత్రుడిగా చెప్పుకునే యారో అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి అడ్డదిడ్డంగా మీడియా ప్రకటనల కాంట్రాక్టులు ఇస్తూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లో సైతం పత్రికలకు మన ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇస్తూ వందల కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని, ఆ సొమ్ము మళ్లీ తన మిత్రుడి బ్యాంకు ఖాతాలోకే చేరుతున్నదని తెలిపారు. ఈ మేరకు క్రిశాంక్ శనివారం ఓ వీడియోను విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక నుంచి ఓ జూనియర్ ఆర్టిస్టును తెచ్చి, ఆయనకు కేసీఆర్ వేషధారణ వేసి మాజీ ముఖ్యమంత్రిని అవమానించే విధంగా యాడ్స్ చేసి టీవీ చానళ్లకు పంపిన ఘనత ఈ జగన్మోహన్రెడ్డిదని తెలిపారు. బీఆర్ఎస్ ఏనాడూ రాజకీయంగా ఇతరులను అవమానించే విధంగా యాడ్స్ చేయించిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏ పండుగైనా, సీఎం విదేశీ పర్యటన అయినా, ప్రభుత్వ కార్యక్రమాలైనా, జైపాల్‌రెడ్డి జయంతులు, వర్ధంతులైనా.. కోట్ల రూపాయల విలువైన పేపర్, వీడియో యాడ్స్‌ను తన మిత్రుడి కంపెనీకి ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కొంటున్న, రాష్ట్రంలో ఏ ఒక్కరూ చదవని కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రకటనలు ఇస్తున్నదని క్రిశాంక్ ఆరోపించారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ పేపర్ ప్రకటనల కోసం ఖర్చుచేస్తున్న ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల సొమ్మని తెలిపారు.