హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయా?, పూర్వాశ్రమంలో సంఘ్‌పరివార్‌తో ఆయనకున్న అనుబంధం కారణంగా బీజేపీ పెద్దలు రేవంత్‌ను తమ వాడిగా భావిస్తున్నారా? అంటే, తాజాగా జరిగిన ఓ ఉదంతం ఇందుకు బలం చేకూర్చేలా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నది. తెలంగాణకు గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులైన సందర్భంగా జరిగిన పరిణామం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాలను పరోక్షంగా బయటపెట్టాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రధాని మోదీ శనివారం రాత్రి తనకు ఫోన్ చేసి త్రిఫుర వెలుపల పని చేయాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారని, ఆ తర్వాత కాసేపటికే సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి తెలంగాణకు స్వాగతం అని అన్నారని, దీంతో తనను గవర్నర్‌గా నియామించినట్టు తెలిసిందని జిష్ణుదేవ్ వర్మ సోమవారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం విషయం మీడియాకు కూడా సోమవారమే తెలిసింది. కానీ ఈ విషయం శనివారం రాత్రే సీఎం రేవంత్‌రెడ్డికి ఎలా తెలిసింది? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. గవర్నర్ నియామకం అంశం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా మంత్రిగా ఉన్నారు. అందువల్ల ఈ విషయం తొలుత ప్రధానికి, ఆ తరువాత హోంశాఖ మంత్రికే తెలుస్తుంది. పోనీ బీజేపీ సీఎం అయినా ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డికి ఈ సమాచారం ఎలా తెలిసిందన్నదే ఈ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. సీఎం రేవంత్‌రెడ్డికి పీఎంవో లేదా కేంద్ర హోంశాఖ వర్గాల నుంచే సమాచారం అంది ఉండాలనే అనుమానం వ్యక్తమవుతున్నది.
రేవంత్‌పై మొదటి నుంచి అనుమానాలే ?
రేవంత్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన సందర్భంగా అదే పార్టీకి చెందిన పంజాబ్ మాజీ సీఎం అమరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. సంఘ్‌పరివార్‌తో సంబంధాలున్న వ్యక్తిని పీసీసీ అధ్యక్షునిగా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని అమరేందర్‌సింగ్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎంపీగా ఉన్న సందర్భంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ పుట్టుపూర్వోత్తరాలపై రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం సంఘ్ పరివార్‌తో ఆయనకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేశాయని ఈ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంలు ఎవరూ కూడా ప్రధాని మోదీని బడేభాయ్గా సంబోధించిన దాఖలాలు లేవని కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాల వల్లనే కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియామకంపై మొదటి సమాచారం ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.