హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అకడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం సూచించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం హైదరాబాద్కు తిరిగొచ్చిన మంత్రి ఉత్తమ్, ఆదిత్యనాథ్ దాస్, వేం నరేంద్రెడ్డితో కలిసి రాత్రి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితులు, చేపట్టిన సహకార చర్యలపై సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.