నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని ఆశచూపి సాగించిన వసూళ్ల పర్వం ప్రపంచానికి తెలిసిపోయింది. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్ధలు కొట్టినట్టయింది. తెలంగాణ రాష్ట్రం స్కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందనే విషయం రుజువైంది.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్ మే 23 (నమస్తే తెలంగాణ): తాము ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఈడీ చార్జిషీట్‌తో నిజమని రూఢీ అయిందని, తన పేరు ఈడీ చార్జిషీట్లో రావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ ఎత్తులు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తన అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని శుక్రవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ‘ఈడీ కేసు నమోదు తర్వాతైనా కేంద్రం చర్యలు తీసు కుంటుందా? లేదంటే అమృత్, ఆర్ఆర్ ట్యాక్స్, సివిల్ సప్లయీస్ స్కాంల తరహాలో వదిలేస్తుందా? ఇది ఇప్పుడు ప్రజల ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న’ అని పేర్కొన్నారు. అధికారంలోకి రాక ముందు వందలకోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకొని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే దివ్యమైన తెలంగాణ దివాలా తీసిందని విమర్శించారు.
ధన దాహంతోనే ఈడీ కేసులో అడ్డంగా దొరికిపోయారని విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు రేవంత్‌రెడ్డి..పొంగులేటి మాదిరిగా చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? కేవలం చార్జిషీట్లో పేరు వరకే ఈడీ పరిమితమవుతుందా? లేదంటే రేవంత్‌రెడ్డిని విచారణకు పిలిచి మొత్తం అవినీతి డబ్బు కక్కిస్తుందా? అనే విషయం సమీప భవిష్యత్తులో తెలిసిపోతుంది’ అని పేర్కొన్నారు. రోజురోజుకూ పెట్రేగిపోతున్న కుమ్ములాటలతో రాష్ట్ర కాంగ్రెస్ కకావికలమైందని విమర్శించారు. ముఖ్యనేతల తిరుగుబాటు భయంతో సీఎం కుర్చీ ఎప్పుడు పోతుందా అనే భయం రేవంత్‌ను అడుగడుగునా వెంటాడుతున్నదని దెప్పిపొడిచారు. దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు తెరపడినట్టేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదనే మాట సీఎం రేవంత్‌కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డి నోట రావడంతో ఆయనకు ఫ్యూజులు ఎగిరిపోయాయని ఎద్దేవాచేశారు. మొన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కమీషన్ల వ్యవహారం బట్టబయలైందని, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈడీ చార్జిషీట్‌తో ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపం పండినట్టేనని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో బోనాలు తీస్తున్న రజక సంఘం మహిళలు, పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరును ఈడీ చార్జిషీట్లో చేర్చిన నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యనేత, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి రూ. 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కున్నారని చేసిన ఆరోపణలు వాస్తవమేని ఈడీ చార్జిషీట్‌తో రుజువైందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రూ.50 లక్షల నగదు బ్యాగుతో దొరికిన వ్యక్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని విచ్ఛలవిడిగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ అవినీతి, అక్రమాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ స్పందించాలని, ఆయనకు వంతపాడి ప్రజల్లో చులకన కావద్దని హితవుపలికారు.