సీబీఐ, ఈడీ, ఈసీ వంటి వ్యవస్థలను బీజేపీ నియంత్రిస్తున్నది. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు కావు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే, ప్రతిపక్షాన్ని నిర్మూలించే విభాగాలు.
– బీహర్‌లో ఓటర్ ఆధికార్ యాత్ర సభలో రాహుల్‌గాంధీ
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నయంటే వాళ్ల అనుబంధ విభాగాలైన ఈడీ, ఐటీ, సీబీఐలను పంపిస్తారు. ఉన్నవాళ్లందరిని అష్ట దిగ్భంధనం చేయమని చెప్పి, తరువాత వ్యతిరేక ఓట్లు తొలగించమని ఎన్నికల కమిషన్‌ను పంపిస్తారు. అత్యంత ప్రమాదకర పరిస్థితి దేశ రాజకీయాల్లో కొనసాగుతున్నది.
-సురంవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : మూడు రోజులు గడవకముందే సీఎం రేవంత్‌రెడ్డి నాలుక మడత వేశారు. తన బాస్‌నే ధిక్కరించారు. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయంపై కాగ్రెస్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రేవంత్ నిర్ణయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పావులు కదపడమేనని, తన చేతిలో ఉన్నఅధికారాన్ని బంగారు పల్లెంలో తీసుకువెళ్లి ప్రధాని మోదీ చేతిలో పెట్టినట్టేనని సీనియర్ నేతలు మండిపడుతున్నాయి. రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సీబీఐ, ఈడీ, ఈసీ వంటి సంస్థలు మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపిస్తున్న సమయంలో రేవంత్‌రెడ్డి పనిగట్టుకొని రాష్ట్రంలోకి సీబీఐని తలుపులు తెరిచి ఆహ్వానించడం అంటే, రాహుల్ గాంధీని ధిక్కరించినట్టేనని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని రేవంత్‌రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని తమకు ఎప్పటి నుంచో అనుమానం ఉన్నదని, అదిప్పుడు నిర్ధారణ అయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎన్నోసార్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని గుర్తుచేస్తున్నారు.
రెండు పిల్లర్లు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకొని రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మీద రాజకీయ ప్రతీకారం, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు బలంగా నమ్మతున్నారు. రేవంత్‌రెడ్డి దుశ్చర్యలను తెలంగాణ రైతులు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో రేవంత్‌రెడ్డి జాగ్రత్తపడ్డారని, విమర్శలు తన మీదకు రాకుండా తెలివిగా బీజేపీ కోర్టులోకి బంతి నెట్టేశారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్‌ను ఏమైనా ఇబ్బంది పెడితే ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతుందని, అప్పుడు తన ప్రమేయం ఏమిలేదని చెప్పుకోవటం కోసం వ్యూహాత్మకంగా కేసు సీబీఐకి ఇచ్చి ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ఏం జరిగినా రాజకీయంగా లెకలు మారటం ఖాయమని, కేసీఆర్‌ని దోషిగా చేసే ఎలాంటి చర్యలు తీసుకున్నా, అది సానుభూతిగా మారుతుందని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్చరిస్తున్నారు. సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తే బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు లేదనే వాదన నిరూపితం అవుతుందని, బీఆర్ఎస్ను విమర్శించే ఆ ఒక్క అస్త్రం లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు. ఇదంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేందుకేనని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో వాపోయారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్‌పై ప్రజా వ్యతిరేకత అంతగా లేదని ఆయన తెలిపారు.
మూడేండ్ల కిందట 2022 ఆగస్టు 30న రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో 51ని జారీచేసింది. దాని ప్రకారం తెలంగాణలో సీబీఐ ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం సీబీఐపై ఉన్న ఆంక్షలను, సాధారణ సమ్మతిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జీవో 51ని సవరించినట్టు సమాచారం. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవల్సిన పనిలేదు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రెడ్ సిగ్నల్ చూపడం ఇదేం కొత్త కాదు. గతంలో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ, కేరళ, జార్ఖండ్, మిజోరం రాష్ట్రాలు సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నాయి. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తమ బాస్ రాహుల్‌గాంధీని కాదని, సీబీఐకి ప్రవేశం కల్పించటంపై కాంగ్రెస్ నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ మెప్పుకోసమే ఇలా రేవంత్ రెడ్డి చాకచక్యంగా పావులు కదిపారని కొందరు మండిపడుతున్నారు. సీబీఐకి అప్పగించడం అనేది రాబోయే రోజుల్లో రాజకీయంగా వాడుకోవచ్చేమోగానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కు తీవ్ర అవమానకర పరిణామం అని పార్టీ నేతలు వాపోతున్నారు.