హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అక్షరాల రూ.28 వేల కోట్లు…! రైతుభరోసా కింద రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కోతలు, కొర్రీలు, ఎగవేతలతో ఏ ఒక్క సీజన్లోనూ రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతుభరోసా పంపిణీ చేసిన పాపాన పోలేదు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, ఎగవేతలను కలిపి లెక్కేస్తే, రైతుభరోసాలో కాంగ్రెస్ సర్కార్ పడ్డ బాకీ లెక్కతేలింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా సీజన్‌కూ ఎకరాకు రూ.7,500 చొప్పున లెక్కేస్తే.. ఐదు సీజన్లలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు రూ.28,720 కోట్లు ఎగవేసింది. పోనీ, ఆ తర్వాత మాట మార్చి ఇస్తున్న ఎకరానికి రూ.6వేల చొప్పున లెక్కేసినా రూ.17,560 కోట్లు ఎగ్గొట్టింది. కేసీఆర్ హయాంలో వరి నాట్లు వేసే సమయంలో టంచనుగా రైతుబంధు రైతుల ఖాతాల్లో జమకాగా, కాంగ్రెస్ హయాంలో ఓట్ల సమయంలోనే రైతుభరోసా పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పుడు తీసుకొంటే రూ.10వేలే వస్తయి.
ఎన్నికల తర్వాత తీసుకొంటే ఎకరానికి రూ.15వేలు వస్తయి. రైతుభరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని సీజన్‌కూ ఎకరానికి రూ.7,500 చొప్పున ప్రతియేటా రూ.15వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం..’- ఇవీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో సైతం హామీ ఇచ్చింది. దీంతో రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు వస్తాయని భావించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహం తెలియలేదు. అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.12వేలే ఇస్తామంటూ మాట తప్పింది. సాధారణంగా ప్రతి సీజన్లో 148 నుంచి 150 లక్షల ఎకరాలకు రైతుబంధు పంపిణీ జరిగేది. ఈ లెక్కన మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సీజన్లో ఎకరానికి రూ.7,500 చొప్పున లెక్కేస్తే, ఐదు సీజన్లకు గానూ రైతులకు రూ.55,800 కోట్లు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయాలి. కానీ రూ.ఆరు వేల చొప్పున రూ.27,080 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. అంటే ఇంకా రూ.28,720 కోట్లు రైతులకు ఎగవేసింది. ఇదిలా ఉంటే, ఆ తర్వాత మాట మార్చి సీజన్‌కూ ఎకరానికి రూ.6వేల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఐదు సీజన్లకుగాను రూ.44,640 కోట్లు పంపిణీ చేయాలి. కానీ రూ.27,080 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. రూ.17,560 కోట్లు బాకీ పడింది.
రెండు, మూడు ఎకరాలకే భరోసా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా పథకానికి గ్రహణం పట్టిందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ హయాంలో రెండున్నరేండ్లలో ఏ ఒక్క సీజన్లోనూ రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతుభరోసా పంపిణీ చేసిందిలేదు. రెండు, మూడు ఎకరాలకే పరిమితమైంది. 2023 యాసంగిలో అప్పటికే రైతుబంధు కోసం కేసీఆర్ జమ చేసిన నిధులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసింది. 2024 వానకాలంలో రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. ఆ సీజన్లో ఏ ఒక్క రైతుకూ, ఒక్క ఎకరానికి కూడా నయా పైసా పంపిణీ చేయలేదు. 2024 యాసంగిలో 148 లక్షల ఎకరాలకు పంపిణీ చేయాల్సి ఉండగా, 84 లక్షల ఎకరాలకు మాత్రమే పంపిణీ చేసింది. ఈ సీజన్లో రైతులకు మూడెకరాల వరకు మాత్రమే పంపిణీ చేసింది. 2025 వానకాలంలో 148 లక్షల ఎకరాలకుగాను 146 లక్షల ఎకరాలకు పంపిణీ చేసింది. ఈ ఒక్క సీజన్లోనే దాదాపు రైతులందరికీ పంపిణీ చేసింది. అయితే అప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో పూర్తి రైతుభరోసాను జమ చేసిందనే విమర్శలున్నాయి. గత యాసంగిలో 148 లక్షల ఎకరాలకుగాను 94 లక్షల ఎకరాలకే రైతుభరోసా పంపిణీ చేసింది. రైతులకు కేవలం ఎకరన్నర వరకే పంపిణీ చేసింది.
ఆరు వేల చొప్పున కాంగ్రెస్ ఇచ్చినదానికంటే.. ఐదు వేల చొప్పున కేసీఆర్ ఇచ్చిందే అధికం!
రైతులకు పెట్టుబడి గోస ఉండొద్దని, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలతో అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 వానకాలంలో ఈ పథకం మొదలైంది. అప్పటినుంచి 2023 వానకాలం వరకు పదకొండు విడతల్లో రైతుబంధు పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.72,828 కోట్లు జమ చేసింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15వేలు ఇస్తామంటూ ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15 వేలు దేవుడెరుగు కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో సీజన్‌కు రూ.5వేల చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సీజన్లలో కలిపి రూ.5 వేల చొప్పున లెక్కేస్తే రూ.37,200 కోట్లు రైతుభరోసా కింద జమ చేయాల్సి ఉండేది. కానీ, కాంగ్రెస్ సర్కార్ రూ.27,080 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన ఇంకా రూ.10,120 కోట్లు బాకీ పడింది. అంటే కాంగ్రెస్ సర్కార్ మ్యానిఫెస్టోలో పెట్టిన రూ. 15వేలను పక్కన పెట్టినా, ఆ తర్వాత అమలు చేస్తున్న రూ.6వేలతో పోల్చినా, కేసీఆర్ ఇచ్చిన రూ.5వేల పంపిణీకి సమానంగా కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
వ్యవసాయమంటే వానకాలమేనా?
వ్యవసాయ సీజన్‌కూ కాంగ్రెస్ సర్కార్ కొత్త నిర్వచనం అమలుచేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయమంటే వానకాలం మాత్రమే అనేలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పథకాలను వానకాలానికి మాత్రమే అమలు చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. రైతుభరోసా పథకాన్ని వానకాలంలో కొంత ఎక్కువ మొత్తంలో పంపిణీ చేస్తున్న కాంగ్రెస్.. యాసంగిలో మరీ దారుణంగా ఒకటి రెండు ఎకరాలకే పరిమితం చేస్తున్నది. సన్నాల బోనస్ విషయంలోనూ ఇదే తీరు. వానకాలం బోనస్‌ను ఇస్తున్న ప్రభుత్వం యాసంగి బోనస్‌ను ఎగవేస్తున్నది. గత యాసంగిలో రూ.1,159 కోట్లు చెల్లించలేదు. ఈ యాసంగిలోనూ రూ.700 కోట్ల వరకు బకాయి ఉన్నది. ఈ నిధులు ఎప్పుడు ఇస్తామనే విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడంలేదు. ఎరువుల పంపిణీ విషయంలో సైతం యాసంగిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ దృష్టిలో వ్యవసాయమంటే వానకాలం మాత్రమేనని, యాసంగిలో చేసేది వ్యవసాయం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సీజన్లో తొలుత రెండెకరాలకే!
ఇప్పటికే ఐదు సీజన్లలో కోతలు, కొర్రీలతో రైతులకు రూ.28 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఎగవేసిన సర్కార్.. తాజాగా ఈ వానకాలం రైతుభరోసాకు ముహూర్తం ఖరారు చేసింది. మంగళవారం శిల్పకళా వేదిక ద్వారా తొలిదశ పంపిణీని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వాస్తవానికి తొలుత మధిరలో సభ ద్వారా రైతుభరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ, అక్కడ భారీ వర్షం కారణంగా సభను రద్దు చేసి శిల్పకళా వేదికకు మార్చారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకుగానూ మొదటి విడతలో రెండు ఎకరాల వరకు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. రెండు ఎకరాలలోపు భూమి కలిగిన 41.37 లక్షల మందికి రూ.2,482.02 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. తొలిదశ వివరాలను వెల్లడించిన మంత్రి తుమ్మల.. రెండో దశ పంపిణీ తేదీ, వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. దీంతో రెండో దశకు ఎన్ని నెలల సమయం తీసుకుంటుందో, అసలు ఇస్తుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు సీజనల్లో కలిపి రైతులకు కాంగ్రెస్ సర్కార్ బాకీ పడిన మొత్తాలు

(నోట్:కేసీఆర్ హయాంలో ఎకరానికి ఇచ్చిన రూ. 5వేల ప్రకారం పంపిణీ చేసినా కాంగ్రెస్ సర్కార్ రైతులకు రూ.10,120 కోట్లు బాకీ పడింది.)

నోట్: ఎకరాలు- లక్షల ఎకరాల్లో, నిధులు- రూ. కోట్లలో, రూ. 7500- మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ, రూ. 6వేలు-ప్రస్తుతం ఇస్తున్న సాయం.