ఖైరతాబాద్, జూన్ 21: తెలంగాణలో మాదిగల ఉనికే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి మాదిగలను మోసం చేస్తూ వస్తుందని, 80 లక్షల జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మాదిగల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం వల్లే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులంతా ఒకే తాటిపై నిలబడడం వల్లే పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు. ఇప్పుడు ఆ కులానికి ఎంతో విలువ పెరిగిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగల ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఉస్మానియా అధ్యాపకుడు ప్రొఫెసర్ కాశీం, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్, గణేశ్, ప్రభాకర్, ఆంజనేయులు, డాక్టర్ సంజీవ్‌నాయక్, రజనీ, పవన్‌కుమార్, నారాయణ, వెంకటేశ్వర ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.