హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయనను దూషించిన తీరు పత్రికల్లో చూసి చాలా బాధ పడ్డా.. నా పార్టీ ఏదైనా సీఎం వాడిన పదజాలం విని సిగ్గుతో తలదించుకుంటున్నా’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత కాట్రగడ్డ ప్రసూన భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాలంటే ఇంత హీ నంగా ఉండాలా? వ్యక్తిగత విమర్శలు చేసుకోవాలా? వాడరాని భాషను వాడి కించపరచలా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
సోమవారం ఆమె మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించి.. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన నేతను ఈ విధంగా తూలనాడటం సరికాదన్నారు. కేసీఆర్తో 18 ఏండ్లు కలిసి పనిచేశానని, ఆయన ఉపన్యాసాలు విని స్ఫూర్తిపొందానని చెప్పారు. ‘వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్డడం సరికాదు.. సీఎం ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలతో రాజకీయాలు చేయొద్దు..’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులతో పోటీపడాలని చురకలంటించారు.