హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బుధవారం లేఖ రాశారు. ఇందుకు గాను భేటీకి తేదీని త్వరగా ఖరారు చేయాలని ఆ లేఖలో కోరారు. గతంలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవల్)కు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీంతో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని, అందుకే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం ప్రస్తావించారు. 148 మీటర్ల కంటే కొంత ఎకువ ఎఫ్ఆర్ఎల్ పరిశీలించినా, మహారాష్ట్రలో ముంపు ప్రభావం తకువగానే ఉంటుందని వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లొస్తాయని వివరించారు.
త్యాగ నిరతి, దైవ భక్తికి ప్రతీక బక్రీద్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం తదితర గొప్ప విలువలను గుర్తు చేస్తున్నదన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో ముందుకు సాగాలనే సందేశాన్ని బక్రీద్ అందిస్తున్నదని రేవంత్ పేర్కొన్నారు.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కల్లాల్లోని ధాన్యం తడువకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.