హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలిలో 130 ఎకరాల అడవిని నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 150 ఎకరాల విస్తీర్ణంలోని భారీ వృక్షాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నది. వనమహోత్సవం పేరిట యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్పైకి అర్ధరాత్రి బుల్డోజర్లను పంపించింది. వనమహోత్సవం పేరుతో శనివారం రాత్రికి రాత్రే 15 ఎకరాల విస్తీర్ణంలోని సుబాబుల్, యూకలిప్టస్, వేప, చింత, తుమ్మ, సీతాఫలం, పలు ఔషధ మొక్కలను, పెద్దపెద్ద వృక్షాలను నేలమట్టం చేసింది. ఏండ్ల తరబడిగా ఏపుగా పెరిగిన చెట్లను ప్రభుత్వ అధికారుల సమక్షంలో నరికివేశారు. చెట్లను నరికిన స్థలంలోనే సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.
చెట్ల నరికివేతపై వర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందళన నిర్వహించారు. వర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వర్సిటీ గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే వనమహోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై యూనివర్సిటీ వీసీ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బొటానికల్ గార్డెన్ పరిధిలోని 150ఎకరాల్లో నిరుపయోగమైన చెట్లను నరికేసి, విలువైన మొక్కలు నాటుతామని చెప్పారు. చెట్లను నరికి, మొక్కలను నాటడమేంటని పర్యావరణవేత్తలు ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు. వర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటారని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెట్లను నరికి మొక్కలను నాటడమేంటో అంతుపట్టడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.