హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంపదపై కన్నేసిన ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రాష్టానికి రావాలని ప్లాన్ చేస్తున్నారని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ విమర్శించారు. కేసీఆర్ చేతి లో పరాభవం పొందిన చంద్రబాబు డొంక తిరుగుడుగా రేవంత్‌రెడ్డి, బీజేపీ ద్వారా తెలంగాణలో పాగా వేసి రివేంజ్ తీర్చుకోవాలని చూ స్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగా తెలంగాణను అభివృద్ధి చేశానని, కాళేశ్వరం ని ర్మాణాన్ని అడ్డుకోలేదని అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ‘టీ న్యూస్’తో ప్రకాశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 97 వేలు ఉంటే దానిని కేసీఆర్ 3.5 లక్షలకు పెంచారని, 62 ఏండ్ల సమైక్య పాలకుల ఏలుబడిలో రూ. 62 వేల కోట్ల రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఉంటే, తెలంగాణలో కేసీఆర్ దానిని రూ.2.2 లక్షల కోట్లకు పెంచారని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూ రూ. 29 వేల కోట్లు ఉంటే, కేసీఆర్ దానిని రూ.1.12 లక్షల కోట్లకు పెంచారని, ఇదంతా కేసీఆర్ తొమ్మిదేండ్ల కష్టార్జితంతో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశం వెనుక కుట్రకోణాలు ఉన్నాయని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించింది, ఆయనకు పీసీసీ చీఫ్ ఇప్పించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మించే సమయంలో అనుమతులు ఇవ్వొద్దంటూ సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖలు రాశారని ఆరోపించా రు. మేడిగడ్డ ప్రాజెక్టుతో ఏపీలోని గోదావరి డె ల్టా ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోయినట్టు వార్తలు వచ్చాయని, మేడిగ డ్డ దెబ్బతినడానికి, చంద్రబాబుకు సంబంధం ఉన్నదేమోనని వీ ప్రకాశ్ అనుమానం వ్యక్తంచేశారు.