హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడో నుంచి రుణం పొందేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖలపై ప్రీ-బడ్జెట్ సమావేశం జరిగింది. భట్టి విక్రమారతో కలిసి మంత్రి కోమటిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల బలోపేతం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.