హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి తడబడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టారని, దాని అమలు అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. వడ్లకు బోనస్‌పై సీఎం సహా కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని, నిరుద్యోగ భృతిపై మాట మార్చారని చెప్పారు. బోనస్‌పై డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు పొంగులేటి, తుమ్మల ప్రకటనలు ఒకోతీరుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్నిరకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వానకాలంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇవ్వాల్సిందేనన్నారు.