హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం గోదావరి నదిలో 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు హక్కులు ఉన్నాయి. కృష్ణా నదిలో 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు జరుగుతున్నాయి. అంటే 1543 టీఎంసీలపై రాష్ర్టానికి జలహక్కులు దాదాపుగా ఉన్నట్టే. ఒకవేళ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. గోదావరిలో 3000 టీఎంసీల మేర వరద పారుతున్నది కాబట్టి అందులో సగం, అంటే 1500 టీఎంసీల వాటా కావాలని కేంద్రంతో కొట్లాడాలి. కృష్ణా జలాల్లో కోరిన వాటా దక్కేలా పోరాడాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రెండు నదుల్లో కలిపి తెలంగాణకు కేవలం 1500 టీఎంసీలు చాలని, మిగతా నీటిని ఏపీ తరలించుకపోయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అంటే.. ఇప్పుడున్న వాటాకన్నా 40 టీఎంసీలు తగ్గించుకొని, జలహక్కులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తాకట్టు పెట్టారని సాగునీటి రంగ విశ్లేషకులు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నీటిపారుదల సలహాదారు ఆధిత్యనాథ్ దాస్ తదితరులతో కూడిన బృందం గురువారం ఢిల్లీకి వెళ్లింది. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాల విజ్ఞప్తి చేసింది. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని సీఏం చెప్పారు. ట్రిబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతున్నదని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గోదావరి నదిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు కేంద్ర జలశ క్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని నీళ్లు తీసుకుపోయినా తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దీనిపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం వదర జలాల పేరుతోనే బనక చర్లను కట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వరద జలాల సూత్రంపై ఆధారపడి గోదావరి జలాల్లో సగం వాటా కోసం కొట్లాడాల్సింది పోయి కేవలం 32 టీఎంసీలు అదనంగా అడగడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. అంటే గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం ఎన్వోసీ ఇచ్చినట్టే అని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉన్నదని ఆరోపిస్తున్నారు. గోదావరి నదీ జలాలను ఆయన దర్జాగా దారి మళ్లించి కృష్ణా బేసిన్‌లోని బకనచర్లకు పట్టుకొని పోవాలని చూస్తుంటే, తెలంగాణ సీఎం మాత్రం మన హక్కు కింద వచ్చే జలాలను వాడుకోవటానికి చంద్రబాబు వద్ద నుంచి నిరంభ్యంతర పత్రం ఇప్పించాలని కేంద్రాన్ని ప్రాధేయపడటం ఏమిటని జలరంగ నిపుణులు, తెలంగాణ రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో ఒకవైపు 575టీఎంసీలకుపైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలకు వినిపిస్తున్నదని, ఇలాంటి సమయంలో 500 టీఎంసీలు ఇస్తే బనకచర్లకు అభ్యంతరం తెలపబోమని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తుంటే ఆయన ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని జలరంగ నిపుణలు ఆరోపిస్తున్నారు.
ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో తాము చర్చకు సిద్ధమని సీఎం వెల్లడించారు. దీంతో ఆయన విశ్వసనీయతపై అనుమానం కలుగుతున్నదని జలరంగ నిపుణులు అంటున్నారు. ఇచ్చంపల్లి చేపట్టడమంటే తెలంగాణను ముంచడమేనని స్పష్టం చేస్తున్నారు. మరి ఎవరిని ముంచి నీళ్లను ఏపీకి మళ్లించేందుకు సీఎం ఈ ప్రతిపాదన చేశారో అర్థం కావటం లేదన్నారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్-2 ఎదుట ఇరు రాష్ర్టాల వాదనలు కొనసాగుతున్న వేళ సీఎం ఈ ప్రతిపాదన ఇవ్వడం అంటే తెలంగాణ హక్కులకు నీళ్లు వదలటమేని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు రాష్ర్టాల మధ్య విచారణ త్వరగా పూర్తి చేసి ఒకేసారి అవార్డు ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. కానీ దానికి విరుద్ధంగా సీఏం వ్యవహరించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ బనకచర్ల ప్రాజెక్టును నిలవరించటం కంటే మూసీ ప్రక్షాళనకు నిధుల సాయం మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ అడిగిన వెంటనే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నారని, తెలంగాణకు మాత్రం ఇవ్వటం లేదని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూసీ ప్రక్షాళనకు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించలేదని, గంగా, యమునా ప్రక్షాళనకు ఇచ్చినట్టే మూసీకి నిధులివ్వాలని ఇవ్వాలని కోరారని తెలిసింది.